టీఆర్ఎస్, బీజేపీల దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కకావికలమైపోతున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు, స్టార్ క్యాంపెయినర్ లు పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయం కట్టేస్తున్న వైనంతో క్యేడర్ కుదేలవుతోంది. ఇప్పటికే డీకే అరుణ, విజయశాంతి వంటి వారంతా బీజేపీ కండువా కప్పుకోగా…తాజాగా అదే బాటలో మరో కాంగ్రెస్ కీలక నేత పయనించారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.
రాజీనామా విషయమై తన అనుచరులకు సమాచారమిచ్చిన కొండా తాను బీజేపీలో చేరబోతున్నట్టు వారికి చెప్పారు. చాలాకాలం నుంచి బీజేపీ గూటికి కొండా చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండేందుకు ఇన్నాళ్లు ఈ నిర్ణయాన్ని కొండా వాయిదా వేసుకున్నారట. ఆదివారం ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కొండా నేడు తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో, బీజేపీలో కొండా చేరబోతున్నారన్న ఊహాగానాలకు నేటితో తెరపడినట్లయింది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి గెలిచిన కొండా…తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించే కొండా…తెలంగాణ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్వతహాగా ఇంజనీర్ అయిన కొండా…కరోనా సమయంలో పలు రకాల మాస్కులను స్వయంగా తయారు చేశారు.