సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అపరిపక్వ నిర్ణయాలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలోని దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని హర్షకుమార్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటన సందర్భంగా జగన్ పై హర్షకుమార్ నిప్పులు చెరిగారు.
ఇక, హోంమంత్రి సొంత గ్రామమైన పోచవరంలో దళిత యువకుడిని ఉరివేసి హత్య చేసిన ఘటనలో నిందితులను అరెస్టు చేయలేదని కూడా హర్ష కుమార్ మండిపడ్డారు. నిందితుల నుంచి పోలీసులు ముడుపులు తీసుకుని దళితుల కేసులను నీరుగారుస్తున్నారని హర్ష కుమార్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా హర్ష కుమార్ స్పందించారు.
ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మార్చడం బాధాకరమని హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అన్ని పేర్లు మార్చడం కన్నా ఒకేసారి జగన్ ఆంధ్రప్రదేశ్ అని మార్చుకోవాలంటూ జగన్ పై సెటైర్లు వేశారు. రాబోయే ప్రభుత్వం అన్ని పేర్లను రద్దు చేస్తుందని హర్ష కుమార్ చెప్పారు. ప్రతి యాత్రను అడ్డుకోవాలన్న ధోరణిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. అమరావతి రైతులు పాదయాత్ర చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారని, శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు.
గతంలోనూ జగన్, సజ్జలపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఓవరేక్షన్ ఎక్కువైందని, ప్రభుత్వ విధానాలను ప్రకటించేందుకు సజ్జల ఎవరని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆత్మగౌరవంతో బతకలేని మంత్రులకు ఆ వెధవ పదవులు ఎందుకంటూ హర్షకుమార్ చేసిన కామెంట్లు గతంలో కాక రేపాయి. జగన్ ఒక్క మంత్రికీ అప్పాయింట్మెంట్ ఇవ్వరని, సజ్జలతోనే మాట్లాడి, సజ్జలతోనే మాట్లాడిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన వెధవ బతుకులు, పదవులు ఎందుకని… కొంచెం గౌరవం పెంచుకోండని మంత్రులనుద్దేశించి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.