ఏపీలో టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా మరోవైపు కీలక నేతలు జారి పోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాలో ఒకప్పుడు.. చక్రం తిప్పిన ఆమెను గత ఎన్నికల సమయంలో పార్టీ పక్కన పెట్టింది. అప్పటి నుంచి కూడా ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఆధిపత్య రాజకీయం చేసిన నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. పోటా పోటీగా ఆమె ఈ జిల్లాలో వ్యవహరించారు.
ఈ క్రమంలోనే తనను పక్కన పెట్టారని. కనీసం గుర్తింపు లేకుండా పోయిందని తరచుగా ఆమె చెబుతూనే ఉన్నారు. ఇటు మహిళా పదవుల్లోనూ.. అటు జిల్లా పదవుల్లోనూ ఆమెకు స్థానం కల్పించకపోవడంతో తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆమె వైసీపీ వైపు చూస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. శోభ కుమార్తెస్వాతి.. మంత్రి బొత్స సత్యనారాయణ వర్గంలో కీలక నేతగా, వైసీపీ నాయకురాలిగా చలామణి అవుతున్నారు. ఇది కూడా శోభకు టీడీపీలో ప్రాధాన్యం తగ్గించిందనడానికి కారణంగా మారింది.
విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. గతంలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా శోభా హైమావతి పనిచేశారు. టీడీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. రాజీనామా లేఖను టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పంపనున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే హైమావతి కూతురు స్వాతి వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే.. తన కూతురు పార్టీ మారితే.. తనను టీడీపీకి దూరం పెట్టడం సరికాదని హైమావతి చెప్పుకొచ్చారు. హైమా రాజీనామా చేసిన తర్వాత అధికార వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే జరగనున్న ఎమ్మెల్సీల కూర్పులో ఆమెకు బెర్త్ కన్ఫర్మ్ అయిందని విజయనగరం రాజకీయవ ర్గాలు చెబుతున్నారు. ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఆమెకు పేరుండడం గమనార్హం.