రాష్ట్రంలో నానాటికీ వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలకు కూడా సొంత పార్టీపై అసంతృప్తి ఉన్నా… కక్కలేక మింగలేక ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థ పైన సీఎం జగన్ విపరీతంగా ఆధారపడ్డారని, తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా చిన్న చిన్న పనులు చేయించుకోలేకపోతున్నామని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. వాలంటీర్ కున్న గుర్తింపు పార్టీలో తమకు లేదని అధికార పార్టీకి చెందిన నేతలు వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి వంటి కొందరు పార్టీని వీడగా…తాజాగా మరికొందరు నేతలు ఆ దారిలోనే పయనిస్తున్నారు. ఎన్నికలు మరో ఏడాది లోపే జరిగే అవకాశమున్న నేపథ్యంలో తాజాగా వైసీపీకి విశాఖలో గట్టి షాక్ తగిలింది. విశాఖపట్నం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తలకు, నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని, అందుకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని, వేదన కలిగించినా తప్పడం లేదని అన్నారు.
2009లో ప్రజారాజ్యం తరఫున పంచకర్ల రమేష్ పోటీ చేసి గెలుపొందారు. పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. 2014లో టిడిపిలో చేరిన రమేష్ ఎలమంచిలి నుంచి గెలుపొందారు. ఇక, 2020లో వైసీపీలో చేరిన రమేష్..తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రమేష్..త్వరలో జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.