రాజకీయాల నుంచి దూరం అయిపోతున్నారు అని అనుకుంటున్న సమయంలో తిరిగి తన ఉనికిని చాటుకోవడంలో అందవేసిన చేయిగా సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావును పేర్కొనవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అంత ఎత్తున ఎగిరిపడే గోనె…. తాజాగా గులాబీ దళపతిని ఉక్కిరి బిక్కిరి చేసే ప్లాన్ తో వచ్చారు. కుల రాజకీయాలతో కేసీఆర్ ని టార్గెట్ చేసేందుకు గోనె కార్యాచరణ మొదలుపెట్టారు.
రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించేశారు. దాదాపు 95 శాతానికి పైగా నియోజకవర్గాల్లో పాత అభ్యర్థులను కొనసాగించుకున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుత శాసనసభ్యులనే కొనసాగించడంపై పార్టీ కార్యకర్తల్లోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాటిల్లో ప్రస్తుతం మంచిర్యాల నియోజకవర్గం ఒకటి. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడం గురించి సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మరియు నియోజకవర్గానికి చెందిన కొందరు బీసీ నేతలు ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావుకు టికెట్ ఇవ్వంపై గుర్రుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అరవింద రెడ్డి తన టికెట్ వస్తుందని ఆశించారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంతో ఆయన వ్యూహం మార్చి బీసీలను నిలబెట్టాలనని తన అనుకుంటున్నట్టు పేర్కొంటూ నిలబడే వారికి మద్దతు ఇస్తానని సైతం బహిరంగంగానే ప్రకటించారు. ఈ ఎపిసోడ్ లోకి ఊహించని రీతిలో తాజాగా గోనె ప్రకాష్ రావు ఎంట్రీ ఇచ్చారు.
మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ నేతలు ఏర్పాటుచేసిన సమావేశంలో తాజాగా ప్రత్యక్షమైన గోనె ప్రకాష్ రావు ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో బీసీలు పెద్ద ఎత్తున ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికే టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నిర్ణయం మార్చుకోని పక్షంలో, ఒకవేళ బీసీ నేతలు బరిలో దిగితే తాను మద్దతిస్తానని పేర్కొనడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తానని సైతం ప్రకటించడం గోనే వ్యూహాన్ని చెప్పకనే చెప్తుంది.
మంచిర్యాల నియోజకవర్గంలో బలంగా ఉన్న మెజారిటీ బీసీ ఓటర్ల చేత బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సుదీర్ఘకాలంగా ఉన్న తన రాజకీయ వైఖరిని ఈ సందర్భంగా చాటి చెప్పాలన్న లక్ష్యంతో గోనె ప్రకాష్ రావు ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి హైదరాబాద్ లో నివాసముంటున్న గోనె ప్రకాష్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటించడం, అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయినప్పటికీ ఆయనను ఓడిస్తామని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సొంత కులానికి చెందిన నాయకుడు, పైగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆయన్ను ఓడించడం గురించి శపధం చేయడమే కాకుండా అదే సమయంలో బీసీ నేతను గెలిపిస్తానని గోనె ప్రకాష్ రావు సవాలు చేయడం వెనుక సిట్టింగ్ ఎమ్మెల్యేపై కోపం కంటే కేసీఆర్ పట్ల తనకున్న వైఖరిని చాటి చెప్పడమే కారణమని అంచనా వేస్తున్నారు. గులాబీ దళపతి పట్ల తనకున్న భావాన్ని చాటి చెప్పేందుకు ప్లాన్ బి తో వస్తున్న గోనె ప్రకాష్ రావు ప్రయత్నం ఎంత మేరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.