రాజకీయాల్లో దూకుడు ఉండాలి. అయితే, ఆ దూకుడు.. పార్టీకి, వ్యక్తిగతంగా తనకు కూడా డ్యామేజీ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సదరు నాయకులపైనే ఉంటుంది. గతంలో ఉన్న నాయకులు ఇలానే చూసుకునేవారు. తమ కత్తికి రెండు వైపులా పదునే అన్న నాయకులు కూడా.. తర్వాత తర్వాత.. ఆయా కత్తులను అదును చూసి ప్రయోగించేవారే.. తప్ప.. మొండిగా ముందుకు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండగలిగారు.
కానీ, నేటి తరం ఆ విధంగా లేదు. తమకు ఏది తోస్తే.. అది చేసేయడం, తమకు ఏం కావాలో అది తీసేసుకోవడంమే రాజకీయంగా వ్యవహరిస్తున్నా రని అంటున్నారు పరిశీలకులు.
ఫలితంగా ఇలాంటి నాయకులు తమ ఉనికిని, తమతో ఉన్నవారి ఉనికిని కూడా ఇబ్బందుల్లోకి నెడుతు న్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమన అఖిల ప్రియా రెడ్డి. తన తల్లి మరణంతో ఎమ్మెల్యేగా, తండ్రి మరణంతో మంత్రి పదవిని చేపట్టిన అఖిల ప్రియ… తనకంటూ..వేసుకున్న బాట ఏదైనా ఉంటే.. అది ఆవేశం, ఆక్రోశమనే అంటున్నారు పరిశీలకులు.
నిత్యం దూకుడు, నిరంతరం.. మొండితనంతోనే ఆమె ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. ఇది ఆమెకు వ్యక్తిగతంగా తీవ్ర డ్యామేజీ కలిగిస్తోందని అంటున్నారు. టీడీపీలోనే ఆమెను పక్కన పెట్టారనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది.
టీడీపీలో సొంత నాయకుడు, తన తండ్రి దగ్గర పనిచేసిన నేత, ఏవీ సుబ్బారెడ్డితో నువ్వెంతంటే.. నువ్వెంత? అంటూ.. ఆమె దూకుడు ప్రదర్శించారు. ఆయనకు వ్యతిరేకంగా అధికారంలో ఉన్నప్పుడే అనేక వ్యాఖ్యలు చేశారు. ఇక,దీనిపై చంద్రబాబు రెండు సార్లు.. పంచాయతీ పెట్టి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన మౌనం పాటిస్తున్నారు. మరి ఆయా పరిస్థితు లను గమనించిన అఖిల..అప్పుడైనా మారాలి కదా..? మారకపోగా… ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు. తన భర్త ఈ కేసులో నిందితుడుగా ఉన్నారు. మరి ఇంత జరిగాక కూడా ఆమె దూకుడు ఎక్కడా తగ్గలేదు.
ఫలితంగా టీడీపీలో ఏ ఒక్కరూ అఖిల ప్రియపై సానుభూతి చూపించడం లేదు. ఇదే విషయాన్ని తాజాగా ఆమె మీడియా ముందు వ్యాఖ్యానించారు. “టీడీపీలోనే ఉంటా. సంతృప్తిగానే ఉన్నా. కానీ, ఇప్పుడు నా గురించి ఆలోచించే వారు ఎవరున్నారు?“ అనే వ్యాఖ్యలు చేశారు. నిజమే.. ఇటీవల చంద్రబాబు పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గాలకు ఇంచార్జ్లను నియమించారు. అఖిల ప్రియకుకానీ, ఆ కుటుంబానికి కానీ.. ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు. పోనీ.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిటీలు ఏర్పాటు చేశారు. దీనిలోనూ ఆయన అఖిలను పట్టించుకోలేదు.
ఈ పరిణామాలు నిజంగానే అఖిలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. గతంలో ఎక్కడికి వెళ్లినా.. ఒకరిద్దరు టీడీపీ నాయకులు ఆమె వెంట ఉండేవారు. కానీ, ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఒకింత నిరాసగానే ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా చేసుకున్న వారికి చేసుకున్నంత! అంటే ఇదేనేమో!?