సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఏపీని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో షర్మిల చేరారని, ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ షర్మిలపై షాకింగ్ కామెంట్లు చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారని, జగన్ మీద విషం చిమ్ముతున్న నాన్ లోకల్ ప్రతిపక్ష నేతలు ఏపీకి వచ్చి విమర్శలు చేస్తున్నారని, వారందరినీ ప్యాక్ చేసి హైదరాబాద్ కు పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా అన్నారు.
పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు సంక్రాంతి అల్లుళ్ళులా వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ను మరోసారి సీఎంను చేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధం అని, అందుకు ‘సిద్ధం’ మీటింగ్ సక్సెస్ నిదర్శనమని చెప్పుకొచ్చారు. షర్మిల మాటలకు విలువ, అర్థం లేదని, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమెపై జాలి ఉండేదని అన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని, టీడీపీ-జనసేనకు అభ్యర్థులు లేరని విమర్శించారు. గత పదేళ్లలో తాను ఒక్క రూపాయి తీసుకోలేదని…పరోక్షంగా 40 లక్షల వ్యవహారంపై రోజా క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు.
ఒంగోలు నుంచి తాను పోటీ చేయబోతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రోజా. నగరిలో ఉన్న తనకు ఒంగోలుకు వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నాన్ని మించిన సభ రాయలసీమలో జరగనుందని వెల్లడించారు. పెద్దిరెడ్డిపై ఆదిమూలం కక్షపూరితంగా చేసిన ఆరోపణలు బాధ పెట్టాయని, ఆదిమూలాన్ని గెలిపించింది పెద్దిరెడ్డేనని గుర్తు చేశారు. పార్టీలో మార్పులు, చేర్పులు అర్థం చేసుకోవాలని చెప్పారు. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందని అన్నారు. జగన్ ను మళ్లీ సీఎం చేసేందుకు పెద్దిరెడ్డి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు.