సీఎం జగన్ అస్తవ్యస్థ పాలన, అపరిపక్వ నిర్ణయాలతో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విపక్షాలు మొదలు జాతీయ మీడియా వరకు గగ్గోలు పెడుతున్నాయి. తన మానస పుత్రికలైన ఉచిత పథకాల కోసం ఖజానాలోని డబ్బులను పప్పు బెల్లాల్లాగా జగన్ పంచిపెట్టడంతో ఏపీ మరో శ్రీలంక కావడానికి ఎంతో కాలం పట్టదని ఆర్థిక నిపుణుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో, జగన్ సర్కార్ పై జనాల్లోనూ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. అదే సమయంలో ఏపీలో జగన్ కేబినెట్ 2.0 కొలువుదీరిన తర్వాత వైసీపీ నేతలలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది.
ఈ కారణాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ప్రతిపక్ష టీడీపీ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక, ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది రెడీగా ఉన్నారని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే మొన్న మొన్నటివరకు వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైన నేతలంతా టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న రావెల…టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో రావెల నిన్న భేటీ కావడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో రావెల భేటీ నేపథ్యంలో ఆ పుకార్లకు మరింత ఊతం లభించింది. రావెల టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రావెల…ఆ తర్వాత జనసేనను వీడి బీజేపీలో చేరారు.
ఉన్నత విద్యావంతుడైన రావెల కిశోర్ బాబు ఐఆర్ఎస్ అధికారిగా పని చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రావెలకు చంద్రబాబు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రావెల ఎస్సీ సామాజిక వర్గ కోటాలో తొలిసారి మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించిన రావెల…తిరిగి టీడీపీలోకి రావాలని చూస్తున్నారు.