సీఎం జగన్ సమక్షంలో మాజీ టీడీపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రావెలకు కండువా కప్పిన జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తర్వాత రావెల వైసీపీలో చేరారు. రావెల పోటీ చేసే స్థానంపై చర్చ జరిగిన తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని రావెల కిషోర్ బాబు అన్నారు.
దేశంలోనే అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. అంబేద్కర్ కలను జగన్ సాకారం చేశారని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక, రెండున్నర లక్షల కోట్ల రూపాయల నిధులను పేదల ఖాతాలోకి జమ చేయడం దేశంలోనే ఒక విప్లవమని ప్రశంసించారు. 2014-2019 టీడీపీ హయంలో ఎస్సీ కోటలో నాలుగేళ్లు మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు…2018లో జనసేన పార్టీలో చేరారు. 2019లో జనసేన తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేనను వీడి బిజెపిలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.
ఇక, తాజాగా వైసీపీలో చేరారు. ప్రతిపాడు వైసీపీ ఇన్చార్జి బాలసాని కిరన్ ను తప్పించి ఆ స్థానంలో రావెల కిషోర్ బాబును పత్తిపాడు వైసీపీ ఇన్చార్జిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తాడికొండకు జగన్ మార్చిన సంగతి తెలిసింది. కిరణ్ కు స్థానిక కేడర్ లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలడంతో కిషోర్ బాబును వైసీపీ నేతలు సంప్రదించినట్టుగా తెలుస్తోంది.