టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అయితే ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేసి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీక్ష చేపట్టిన సునీతను ఎత్తుకొని వెళ్లి అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు తీరుపై పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల ఆదేశాలతోనే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబును, టిడిపి నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరిని మర్చిపోబోమని, గుర్తుపెట్టుకుంటామని సునీత వార్నింగ్ ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు. సైకో జగన్ చెప్పినట్టు చేయడం పోలీసులకు తగదని, దీక్ష చేపట్టింది ప్రైవేట్ స్థలం అని సునీత హితవు పలికారు. శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా దీక్ష చేసినా అరెస్టు చేశారని మండిపడ్డారు. తన నిరాహార దీక్షా శిబిరానికి భారీ సంఖ్యలో జనాలు రాబోతున్నారని, ఆ భయంతోనే దీక్షను భగ్నం చేశారని ఆరోపించారు. ఇదే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలిచి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్తున్న టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిశీలనకు అనుమతి లేదంటూ బలవంతంగా అదుపులోకి తీసుకొని పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలకు, నరేంద్ర అనుచరులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేసిందని నరేంద్ర అన్నారు.