ఏపీలో టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను అరెస్టు చేసిన ఘటన రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన కుమారుడి వర్థంతి కార్యక్రమంలో ఉన్న నారాయణను కనీసం నోటీసులివ్వకుండా హఠాత్తుగా అదుపులోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ హోదా నుంచి నారాయణ తప్పుకొని చాలాకాలమైందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
ఆ తర్వాత కోర్టులో నారాయణకు బెయిల్ మంజూరైంది. అయితే, ఈ బెయిల్ మంజూరు కావడంతో ఏపీ ప్రభుత్వం పరువుకు భంగం వాటిల్లింది. దీంతో, నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలని చిత్తూరు కోర్టులో ఏపీ సర్కార్ చాలా రోజుల క్రితమే పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై గతంలో విచారణ జరిపి వాయిదా వేసిన కోర్టు తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఈ నెల 24కు ఆ పిటిషన్ విచారణ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
కాగా, రిమాండ్ విధించకుండానే నారాయణకు బెయిల్ ఇచ్చారంటూ ఆ పిటిషన్ లో ప్రభుత్వం పేర్కొంది. కానీ, జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తేనే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఉండడంతో మొక్కుబడిగా రివిజన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ జరిపిన చిత్తూరు జిల్లా కోర్టు నారాయణకు కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీచేసింది.
మరోవైపు, ఈ కేసులో నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఊరటనిచ్చింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వారు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా…దానిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.