టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరి నారాయణకు కోర్టు షాకిచ్చింది. నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, నవంబర్ 30 లోపు నారాయణ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించడం సంచలనం రేపుతోంది. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బెయిల్ రద్దయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో నారాయణ చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో అక్రమాలకు పాల్పడ్డారని, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ఇటీవల నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. అంతేకాదు, అమెరికాలో వైద్య చికిత్స చేయించుకునేందుకు కూడా నారాయణకు కొన్ని సడలింపులు లభించాయి. ట్రీట్ మెంట్ కోసం నారాయణ అమెరికా వెళ్లి వచ్చేందుకు హైకోర్టు 3 నెలల సమయాన్ని కేటాయించింది.
అయితే, నారాయణ అమెరికాకు వెళ్లేందుకు గతంలో సీఐడీ ఆయనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు అడ్డంకిగా మారాయి. దీంతో నారాయణకు ముందస్తు బెయిల్ లభించినా, ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద క్లియరెన్స్ పొందేందుకు లుకౌట్ నోటీసులు ప్రతిబంధకంగా మారాయి. దీంతో, నారాయణ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో లుకౌట్ నోటీసులను ఎత్తివేయాలని హైకోర్టు గతంలో సంచలన ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 22 నాటికి అమెరికా నుంచి నారాయణ తిరిగి రావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే చిత్తూరు కోర్టు తాజాగా నారాయణ బెయిల్ రద్దు చేయడం సంచలనం రేపుతోంది.