మల్లారెడ్డి … పాలమ్మినా.. పూలమ్మినా.. కాలేజీలు పెట్టిన.. అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి నవ్వుల పువ్వులు పూయించే బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ ముచ్చట రచ్చ రేపుతోంది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పూర్తిగా టచ్‌లోకి వచ్చేశారు. అంతేకాదు.. బీఆర్ ఎస్ నేతల ఫోన్లను కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం లేదు. దీంతో ఇక, ఆయన, ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి.. ఇక, బీఆర్ ఎస్ నుంచి పలాయనం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఏం జరిగింది?
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే(ఆయన అల్లుడు) మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశం అయ్యారు. దుండిగల్ చెరువును ఆక్రమించి నిర్మించిన .. మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సీఎం సలహాదారుతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మర్రికి చెందిన కళాశాలల రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లు కూల్చివేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం రోజుల క్రితం యాజమాన్యానికి నోటీసులిచ్చారు.
మరో వైపు మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసులు పెట్టారు. ఉచిత ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలంటూ.. బీఆర్ఎస్ శ్రేణులు అల్వాల్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడ పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగడంతో ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారంటూ.. ఎమ్మెల్యే మర్రిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలా మామా అల్లుళ్లు సీసెం రేవంత్ సలహాదారుతో భేటీ కావడం గమనార్హం. దీనికితోడు బీఆర్ ఎస్ నేతల ఫోన్లకు సైతం వారు రియాక్ట్ కావడం లేదు. దీంతో వారు ఇక, జంపేనని.. రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.