సంచలన ఆరోపణ ఒకటి తెర మీదకు వచ్చింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు కొందరు అక్రమపద్దతిలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఉదంతం రాజకీయంగా పెను ప్రకంపనలకు కారణమైతే.. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై బంజారాహిల్స్ కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఆయన ఈ మొయిల్ ద్వారా తెలంగాణ సీఎంవోకు ఒక ఫిర్యాదు చేశారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఒక పోలీసు ఉన్నతాధికారి (అప్పటి టాస్క్ ఫోర్సు డీసీపీ రాధాకిషన్ రావు) సాయంతో తన ఇంటిని లాక్కున్నట్లుగా ఆరోపించారు.
ఎస్ఐబీ ఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న అప్పటి టాస్క్ ఫోర్సు డీసీపీ రాధాకిషన్ రావు అప్పట్లో హైదరాబాద్ సీసీఎస్ లో ఆర్థిక నేరాల విభాగాన్ని పర్యవేక్షించారు. అక్కడే ఏసీపీ ఉమామహేశ్వరరావు పని చేశారు. ఆయన పైనా శరణ్ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఉదంతంలో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని.. సెంట్రల్ క్రైంస్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. రూ.50 లక్షల నగదు వసూలు చేసినట్లుగా ఆరోపించారు. దుబాయ్ నుంచి ఆయన పంపిన ఈమొయిల్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే ఈ ఉదంతంపై దర్యాప్తు చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంతకూ శరణ్ చౌదరి చేసిన ఆరోపణలు ఏమిటి? అన్నది చూస్తే..
– ఏడాది క్రితం అప్పట్లో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి నన్ను బెదిరింపులకు గురి చేశారు. నా ఇంటిని ఆయన బంధువు పేరిట రాయించుకున్నారు. ఇందుకు అప్పటిపోలీసు అధికారులు ఎర్రబెల్లికి సహకరించారు.
– నా ఇంటిని ఎర్రబెల్లి తన బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు నన్ను సీసీఎస్ లో ఉంచి.. బలవంతంగా రూ.50 లక్షల నగదును బదిలీ చేయించుకున్నారు.
– 2023 ఆగస్టు 21న నేను బీజేపీ ఆఫీసుకు వెళుతున్నాను. మఫ్టీలో వచ్చిన పోలీసులు నన్ను అడ్డుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో నన్ను హైదరాబాద్ సీసీఎస్కు తరలించారు. నేను పలువురి వద్ద అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటున్నాని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు.
– ఆ తర్వాత అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సూచన మేరకు నన్ను తీవ్రంగా కొట్టారు. ఆయన నన్ను కింద పడేసి బూటు కాళ్లతో తన్నారు. అప్పటికప్పుడు నా ఇంటి ఒప్పంద పత్రాల్ని సిద్ధం చేసి.. సంతకాలు తీసుకొని మంత్రి ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరు మీద రాయించారు. రెండురోజులు సీసీఎస్ లోనే అక్రమంగా బంధించారు. చెప్పులతోకొట్టారు. వారి వేధింపులకు తట్టుకోలేక నా ఇంటిని విజయ్ పేరు మీద రిజిస్ట్రర్ చేయటానికి అంగీకరించాను.
– ఆ తర్వాత మా ఇంటికి ఫోన్ చేశారు. నా కుటుంబ సభ్యుల్ని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. నా స్నేహితుడి ద్వారా రూ.50లక్షలు తెప్పించి.. రాధాకిషన్ రావు.. ఉమామహేశ్వరర్ రావుకు ఇచ్చిన తర్వాతే నన్ను విడిచి పెట్టారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించాను. రిట్ పిటిషన్ దాఖలు చేశాను. అయితే.. ఏసీపీ ఉమామహేశ్వరరావు నా వద్దకు పోలీసుల్ని పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారు.