సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంపై విచారణ కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని ఇటీవల సంచలన ప్రకటన చేయడం కలకలం రేపింది. ఇక, ఈ కేసులో అసలు దోషులు వేరే ఉన్నారని, వారిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
వివేకా మర్డర్ మిస్టరీలో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోందని, అయినప్పటికీ ఆయనను సైడ్ చేసేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివేకా మర్డర్ మిస్టరీపై కడప జిల్లా సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని డీఎల్ షాకింగ్ ఆరోపణలు చేశారు.
కోడికత్తి కేసులాగే వివేకా కేసును కూడా పొలిటిసైజ్ చేశారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు వివేకా హత్యతో సంబంధం ఉందని ఆరోపించారు. చిన్నాన్నను చంపిన విషయం జగన్కు, వారి బంధువులకు తెలుసని కూడా డీఎల్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని, వివేకా హత్య కేసును కూడా రివర్స్ పాలనలోనే నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయగలిగితేనే సామాజిక న్యాయం వస్తుందని డీఎల్ అభిప్రాయపడ్డారు. దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మూడు ఫేక్ ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. 3 కంపెనీలతో ఒప్పందాల కోసమే దావోస్ వెళ్లాల్సిన పని లేదని చురకలంటించారు.