వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు రెడీ అయ్యారా? అవుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలో తొలిగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయన పార్టీపైనా.. అధినేత జగన్‌పైనా తీవ్ర ఆవేదనలో ఉన్నారనేది తెలిసిందే.
రెండు రోజుల కిందట కూడా వైసీపీ సర్కారుపై ఆయన పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌పైనా ఆయన విమర్శల బాణాలు సంధించారు. అంతేకాదు.. అందరూ కలిసి పనిచేస్తేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పారు. దీంతో ఆయనలో అసంతృప్తి.. ఆవేదన రెండు పెరుగుతున్నా యనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు ఆళ్ల రాజీనామా తర్వాత.. ఆయన తీసుకునే నిర్ణయం ఇలానే ఉండనుందనే వాదన వినిపిస్తోంది.
ఇక, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా రాజీనామా దిశగానే ఆలోచన చేస్తున్నారు. తనకు స్థానికం గా రెడ్డి సామాజికవ ర్గంతో విభేదాలు పొడచూపుతున్నాయి. మంత్రి వర్గంలో తనకు స్థానం ఇవ్వలేదనే ఆవే దనలోనూ ఉన్నారు. ఇక, పార్టీ నుంచి తనకు సరైన ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.
ఇదే దారిలో దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణు గోపాల్ కూడా ఉన్నారనేది ప్రచారంలో ఉంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశానికి గేట్లు మూసేశారు. ఇక్కడ నుంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పోటీకి రెడీగా ఉన్నారు. దీంతో మద్దిశెట్టి తన దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు ఆయన రాజీనామా విషయంలో మౌనంగా ఉన్నా.. ఆళ్ల చూపిన దారిలో ఆయన ఇప్పుడు ఫాలో అయ్యే అవకాశం ఉంది.
పిఠాపురం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయన కూడా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. నిధులు ఇవ్వట్లేదని.. ప్రజలతో తాను తిట్లు తింటున్నానని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొనలేదని ఆయన చెబుతున్నారు. సో.. ఆయన కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యం లేదు. ఇలా.. పదుల సంఖ్యలో నాయకులు రాజీనామా దిశగా అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.