రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. అవకాశం-అవసరం అనే రెండు పట్టాలనే రాజకీయ ప్రయాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని రాజకీయం కూడా అదే తరహాలో మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీకి చెందిన కీలక నాయకులు చాలా మంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరు తమకు ఏమేరకు ఛాన్స్ చిక్కినా పార్టీకి రాం రాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఇలాంటి వారిలో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత అయిన బాలినేని.. సీఎం జగన్‌కు దగ్గరి బంధువు కూడా. వైసీపీ ప్రభుత్వం రాకముందు నుంచి జగన్‌తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ పార్టీలో చేరారు. 2012లో ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉంటూ వచ్చారు.
జగన్‌కు వరుసకు మామ అవ్వడంతో వైసీపీలో, జగన్ దగ్గర బాలినేని ఆడింది ఆట.. పాడింది పాటే అయ్యింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని మంత్రి పదవి చేపట్టారు. కానీ మూడేళ్లు తిరిగే సరికి ఆయనను జగన్ పక్కనపెట్టేశారు. అదే సమయంలో జిల్లాలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూల పు సురేష్‌ను మరోసారి మంత్రిగా కొనసాగించారు. దీనిని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ.. వైసీపీ అధిష్టానం బాలినేని వాదనను వినిపించుకోలేదు.
దీనికి తోడు రాజకీయంగా కూడా బాలినేనికి ప్రాధాన్యం తగ్గించే వ్యూహాన్ని వైసీపీ నేతలు అమలు చేస్తు న్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విసిగిపోయిన బాలినేని పార్టీ మార్పునకు రెడీ అవుతున్నారనే చర్చ ఆయన వర్గం నుంచి జోరుగా వినిపిస్తోంది. దీనిని పసిగట్టిన టీడీపీ వెంటనే రంగంలోకి దిగిందని.. ఆయనతో చర్చలు కూడా జరిపినట్టు ప్రధాన మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
అంతేకాదు.. బాలినేని వంటి బలమైన నాయకుడిని తమ పార్టీలో చేర్చుకుంటే 2024 ఎన్నికలకు ముందు తమకు మేలు చేస్తుందని టీడీపీ నాయకులు అంచనావేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కొన్ని స్థానాలను కూడా ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, దర్శి వంటి నియోజకవర్గాల్లో బాలినేని వర్గానికి టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమనే టీడీపీ నిర్ణయించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే.. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న వైసీపీ అంతర్గత పోరులో బాలినేని పైచేయి సాధించకపోగా.. ఆయన ప్రభావం భారీగా తగ్గుతున్న నేపథ్యంలో పార్టీ మారినా ఆశ్చర్యంలేదని బాలినేని అనుచరులు కూడా చెబుతుండడం గమనార్హం.