ఎంతలో ఎంత మార్పు! అధికారంలో ఉన్నామనే అహంకారంతో ముందూ వెనుకా ఆలోచించకుండా వైసీపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి కూడా నీచమైన కామెంట్లు చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓటర్లు ఇచ్చిన షాక్‌కు ఇప్పుడు వైసీపీ పొలిటికల్ ఫ్యూచరే ప్రమాదంలో పడింది. ఊహించని ఈ అవమానంతో వైసీపీ కీలక నాయకులు కూడా కూలబడ్డారు. అప్పుడు గొంతు చించుకున్న వాళ్లే ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దెబ్బకు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట మార్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలో ఉన్నాం కదా అని, పవన్ ఏం చేస్తారులే అని అనుకున్న అనిల్ కుమార్ గతంలో పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పార్టీని గెలిపించుకున్న పవన్ డిప్యూటీ సీఎంగా అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. మరి అనిల్ ఏమో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అనిల్ రోడ్డు మీద ఉంటే పవన్ శాసనసభలో ఉంటారని జనసేన శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. మరోవైపు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, వైసీపీని పాతాళానికి తొక్కడంలో పవన్‌దే ఇంపార్టెంట్ రోల్. దీంతో అనిల్ మాట మార్చారు. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని తాను అనలేదని అన్నారు.
ఇక ఎన్నికల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పిన అనిల్ కుమార్ ఆ మాటలను కూడా తూచ్ అంటూ కొట్టిపారేశారు. రాజకీయ సన్యాసంపై తాను సవాల్ విసిరిన మాట వాస్తవమేనని, కానీ రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ తన సవాల్‌ను స్వీకరించలేదని అనిల్ అన్నారు. అందుకే సవాలుకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. మాటకు కట్టుబడే అలవాటు ఎలాగో అనిల్‌కు లేదని కూటమి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇక వైసీపీ మంత్రులుగా ఉన్న సమయంలో ఆ నాయకుల నోటి దూల పార్టీకి నష్టం చేసింది. ఒకవేళ మంత్రుల నోటి దూల వల్ల ఓడిపోయి ఉంటే పొరపాట్లను సరిదిద్దుకుంటామని అనిల్ చెప్పడం గమనార్హం.