టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య 2005లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రవిని రాజకీయ ప్రత్యర్థులు హత్య చేశారని విమర్శలు వచ్చాయి. అయితే, ఫ్యాక్షన్ రాజకీయాల్లో భాగంగా రవిని మద్దెల చెర్వు సూరి చంపించాడని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత మొద్దు శీను హత్య, భాను తెరపైకి రావడం వంటివి ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి.
అయితే,పరిటాల రవి హత్య సమయంలో అనంతపురం ఎస్పీగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై కూడా పలు సంచలన ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. ప్రాణహాని ఉందని చెప్పినా రవికి తగిన రక్షణ కల్పించలేదని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణనిచ్చారు. హత్య జరిగిన సమయంలో తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.
పరిటాలకు ప్రమాదం ఉందని, రవి కూడా తనను కలిసి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. జైల్లో రవి హత్యకు కుట్ర జరిగిందని చాలామంది అన్నారని, అప్పట్లోనే తాను రవికి ప్రాణహాని ఉందని ప్రభుత్వానికి ఒక లేఖ ఇచ్చానని అన్నారు. ఒక జిల్లా ఎస్పీగా జరిగిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశానని అన్నారు. అయితే, దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
పరిటాల హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని, ప్రతిభ ఉన్న ఐపీఎస్‌లనే సీబీఐలోకి తీసుకుంటారని చెప్పారు. హత్య జరిగిన తర్వాత ఎస్పీగా తాను దర్యాప్తు మాత్రమే చేయగలనని అన్నారు. తనపై హత్యకు కుట్ర జరుగుతోందని రవికి తెలుసని, తాము కూడా ఎన్నోసార్లు చెప్పామని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆనాడు అనంతపురం ఎస్పీగా ఉన్న తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.