ప్రస్తుతం ఏపీలో కొత్త కేబినెట్ కూర్పుపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. పాత మంత్రులలో కొనసాగింపు దక్కని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరేమో బయటపడగా…మరికొందరేమో బహిరంగంగా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంతోపాటు, మూడు రోజులు ప్రయత్నించినా సజ్జల అపాయింట్ మెంట్ దొరకలేదన్న కారణాలతో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నిన్న రాత్రి సుచరితను బుజ్జగించేందుకు వచ్చిన ఎంపీ మోపిదేవి వెంకటరమణకు రాజీనామా లేఖను తన కూతురితో సుచరిత ఇప్పించారని టాక్ వచ్చింది. ఈ విషయాన్ని సుచరిత కూతురు నిన్న రాత్రే వెల్లడించారు. అయితే, అది రాజీనామా లేఖ కాదని వైసీపీ నేతలు కొట్టిపారేశారు. దీంతో, సుచరితను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా సుచరిత తన రాజీనామా ప్రకటనను అధికారికంగా చేసి అందరికీ షాకిచ్చారు.
మంత్రి పదవి రాకపోవడం, సజ్జల తీరుతో సుచరిత మనస్తాపం చెందిన సుచరిత ఇవాళ జరిగిన కార్యకర్తలతో సమావేశంలో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే, వ్యక్తిగత కారణాలతోనే తాను ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, రాజకీయాల్లో ఉన్నంత కాలం పార్టీలో కొనసాగుతానని సుచరిత స్పష్టం చేశారు. అయితే, తనకోసం పార్టీలోని కార్యకర్తలెవరూ రాజీనామా చేయవద్దని, పార్టీకి నష్టం చేయవద్దని సుచరిత కోరారు.కానీ, సుచరితకు మద్దతుగా ప్రత్తిపాడులో కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు.
మరోవైపు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తనకు మరో చాన్స్ దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి బాలినేనికి హైబీపీ రావడంతో డాక్టర్ ను సంప్రదించారు. బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల వచ్చినా….ఆయన చల్లబడలేదని తెలుస్తోంది. తన నివాసంలో ప్రకాశం జిల్లా నేతలు, అనుచరులతో బాలినేని ఈ రోజు కీలక భేటీ నిర్వహిస్తున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలినేనిని మార్కాపురం ఎమ్మెల్యే కొండారెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. బాలినేని కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బాలినేనికి మద్దతుగా మేయర్, కార్పొరేటర్లు సమావేశం కాగా, ఒంగోలు జడ్పీటీసీ చండూచి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.