గత కొద్దికాలంగా ఏపీలో రాజకీయాలు హాటెక్కిన సంగతి తెలిసిందే. దీనికి కేవలం రాజకీయపరమైన కారణాలే కాకుండా సినిమాలు, పక్క రాష్ట్రంలోని సమీకరణాలు, దేశవ్యాప్తంగా నెలకొన్న అంశాలు కూడా కారణంగా చెప్పవచ్చు. ఈ హీట్‌కు కొనసాగింపుగా అన్నట్లు తాజాగా ఏపీలో మరో హాట్ అప్డేట్ తెరమీదకు వచ్చింది. గత కొంతకాలంగా కాపు నేతలు భేటీల మీద భేటీలు అవుతున్నారని టాక్ నడుస్తుండగానే…మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు కొత్త చర్చకు తెరలేపారు. తన సారథ్యంలో ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థ ఆవిర్భావం జరిగిందని ఆయన ప్రకటించారు.
విశాఖలో కాపు నేతల సమావేశం అవడమే కాకుండా ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాపు, బహుజన సామాజిక వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్రం కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీ ఏర్పాటు చేయాలని, దీనికి మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు నేతృత్వం వహించాలని ఈ సమావేశంలో డిసైడయ్యారు. అనంతరం మాజీ డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుగా పనిచేస్తుందన్నారు. భవిష్యత్ లో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని, ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీన్ని భావించవచ్చు అన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా పర్యటనలు చేస్తామని మాజీ డీజీపీ కీలక ప్రకటన చేశారు.
బహుజన,కాపు, అగ్రవర్ణ పేదల కలయికతో కొత్త సమీకరణలు ప్రారంభం అవుతాయని మాజీ డీజీపీ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కాపు రిజర్వేషన్లు కంటే ఆర్ధిక,సామాజిక,రాజకీయ ఎదుగుదలే కీలకం అని సాంబశివరావు చెప్పారు. రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు కావాల్సిన అంత చోటు ఉందని కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున కాపునేతల సమీకరణలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని, ఫోరం ఫర్ బెటర్ ఏపీ ఈ కోణంలోనే కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.