ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి పరిచయం అక్కర లేదు. అత్యంత అవమానకర రీతిలో ఆ ఐఏఎస్ అధికారికి జగన్ సర్కార్ ఉద్వాసన పలికిందని గతంలో విమర్శలు వచ్చాయి. జగన్ హయాంలో తొలి సీఎస్ గా పనిచేసిన ఎల్వీని జగన్ హఠాత్తుగా తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, ఆ తర్వాత తన తొలగింపుపై ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎక్కడా స్పందించలేదు. కానీ, తాజాగా 8 మంది ఐఏఎస్ లకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో ఎల్వీ మౌనం వీడారు. ఈ క్రమంలోనే జగన్ పై ఎల్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో చీఫ్ సెక్రటరీని సీఎం ఎంపిక చేస్తున్నారని, సోమవారం సీఎంకు ఒక సీఎస్ నచ్చొచ్చని, శుక్రవారం నాటికి నచ్చకపోవచ్చని షాకింగ్ కామెంట్లు చేశారు. పాత సీఎస్ మీద మీద మోజు తీరిపోవచ్చని, ఆయన మొహం నచ్చకపోవచ్చని, లేదంటే ఆయన ఆలోచనలు నచ్చకపోవచ్చని… కానీ ప్రశ్నించే అధికారం మాత్రం ఎవరికీ లేదని జగన్ ను ఉద్దేశించి ఎల్వీ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
ఈ విషయంపై కొందరు హైకోర్టులో పిల్ వేశారని, కానీ, ఇది పిల్ కిందకు రాదని హైకోర్టు చెప్పిందని అన్నారు. సీఎస్ వ్యక్తిగతంగా పిటిషన్ ఫైల్ చేస్తే తాము వింటామని, సీఎస్ గా ఎవరుంటే ఏమి? అని సమాజం అనుకుంటే.. అది కత్తి లేకుండా యుద్ధం చేసినట్టేనని అన్నారు.
తాను సీఎస్ గా ఉన్న సమయంలో జగన్ తో తాను మాట్లాడానని, ఆయన మనసులో వేరెవరన్నా ఉంటే వారికి ఆదేశాలు ఇస్తానని జగన్ కు చెప్పానని అన్నారు. అయితే, తానే సీఎస్ గా ఉండాలని ఆయన చెప్పారని ఎల్వీ తెలిపారు.
ఆ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించిన అధికారులను పిలిచి మూడు సార్లు హెచ్చరించానని, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సదరు అధికారికి తాను షోకాజ్ నోటీస్ ఇచ్చానని చెప్పారు. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తే ఏమవుతుందనే విషయం ఇప్పుడు 2022లో మనకు గోచరమవుతోందని చెప్పారు. ఇలా జరగకూడదని 2019లోనే సీఎం జగన్ నిర్ణయం చేసి ఉంటే… 2022లో ఎనిమిది మంది ఐఏఎస్ లకు కోర్టు ధిక్కరణ కింద శిక్షపడేది కాదని చెప్పారు. శి
ఆ 8మంది ఐఏఎస్ లు దుఃఖితులై, మీడియాలో, పత్రికల్లో ఫొటోలు పడి అవమానాలకు గురికావాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. వ్యవస్థను గౌరవించకపోతే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని చెప్పారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.