చాలా అరుదైన ఉదంతం థాయిలాండ్ లో చోటు చేసుకుంది. ప్రీస్కూల్ వద్ద ఒక మాజీ పోలీసు అధికారి విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో 34 మంది మరణించిన దారుణం అక్కడ సంచలనంగా మారింది. మరణించిన వారిలో అత్యధికులు అభం శుభం తెలియని అమాయక చిన్నారులే కావటం కలిచి వేస్తోంది.
ఒక అంచనా ప్రకారం మరణించిన 34 మందిలో 22 మంది చిన్నారులే ఉన్నట్లుగా తెలస్తోంది. థాయిలాండ్ లోని ఈశాన్య ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్ బు నాలంపూ ప్రావిన్స్ లో ఈ మారణహోమం చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తప్పించుకోవటంతో అతడి కోసం పోలీసులు వేట షురూ చేశారు.
కాల్పులకు తెగబడిన వ్యక్తిని 34 ఏళ్ల పాన్య ఖమ్రాప్ గా గుర్తించారు. అతడు మాజీ పోలీసులుగా చెబుతున్నారు. ఏడాది క్రితమే అతడ్ని విధుల నుంచి తొలగించారు. మాదక ద్రవ్యాలు వాడినట్లుగా తేలటంలో అతన్ని పోలీసు ఉద్యోగం నుంచి తొలగించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన కేసులో అతను శుక్రవారం కోర్టు విచారణలో భాగంగా న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంది.
అలాంటి సమయంలో ఇలాంటి దారుణానికి పాల్పడటం గమనార్హం. ప్రీస్కూల్ వద్దకు వచ్చిన అతడు.. ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపు.. పలువురు పసి మొగ్గలు నేలకు ఒరిగారు. అరుపులు.. కేకలతో అక్కడి వాతావరణం భీతావాహంగా మారింది. కాల్పులు జరిపిన అనంతరం.. బ్యాంకాక్ రిజిస్ట్రేషన్ ఉన్న వీగో పికప్ ట్రక్ ఎక్కి పారిపోయినట్లుగా గుర్తించారు. ఎందుకీ కాల్పులు జరిపాడన్న విషయంపై విచారణ జరుపుతున్నారు.
మరోవైపు ఇతగాడి ఆచూకీ లభించిందని.. సామూహిక కాల్పుల అనంతరం.. అదే గన్ తో తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా థాయిలాండ్ లో ఈ తరహా కాల్పుల ఉదంతం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. చివరిసారిగా 2020లో ఒక సైనికుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపిన ఉదంతంలో 29 మంది చనిపోగా.. 57 మంది గాయపడ్డారు. ఆ దారుణ ఘటన తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు.