రాజుల కాలంలో జనం పన్నుల రూపంలో కట్టినదంతా రాజుదే. సొంతానికి వాడుకోవచ్చు.. అయితే ప్రజల సంక్షేమానికి వినియోగించే రాజులే నాడు ఎక్కువగా ఉండేవారు. స్వాతంత్రం అనంతరం దేశంలో రాజులు పోయారు.. రాజ్యాలూ పోయాయి.. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. అయితే నవ్యాంధ్రలో మాత్రం ఓ నయా రాజు అవతరించాడు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ప్రజల సొమ్మంతా సొంతానికి వాడుకున్న ఘనుడీయన. అధికారం కోల్పోయినా ఇంకా రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఆయనెవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాచిరంపాన పెట్టి.. అభివృద్ధి అనే మాటే లేకుండా చేసి.. 20-30 ఏళ్లు వెనక్కి నెట్టేసిన ఈయన ఘన చరిత్ర వింటే ఎవరైనా ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే! 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని.. రాజధాని ఇక్కడే ఉంటుందని జనాన్ని నమ్మించి వంచించిన వ్యక్తి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకుని.. కోట్ల రూపాయల ప్రభుత్వ ఖర్చుతో ఇంద్ర భవనంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రత్యేక హెలిప్యాడ్, ఆలయాల సెట్టింగ్‌లు, కళ్లు చెదిరే ఫర్నిచర్, అత్యంత విలాసవంతమైన సదుపాయాలు.. వీటి కోసం చేసిన ఖర్చు కేవలం రూ.45.54 కోట్లు.
ఈ పేదల పక్షపాతి సదరు ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్నపేదలందరి ఇళ్లూ కూలగొట్టి.. వారిని అక్కడి నుంచి తరిమేశారు. తన ప్యాలెస్ పక్కగా వెళ్లే ప్రభుత్వ రహదారిని మూసివేసి సొంతం చేసుకున్నారు. జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు. నిన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రాని పరిస్థితి. ఆయన ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అయినా ఇంకా ఆ రాజభోగాలను అనుభవిస్తూనే ఉన్నారు. గతంలో సొంతానికి అసెంబ్లీ ఫర్నిచర్‌ను వాడుకున్నారన్న అభియోగం మోపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వెంటాడి వేధించారు. కేవలం రూ.2 లక్షలు విలువ చేసే ఫర్నిచర్ అది. మరి ఇప్పుడు 45 కోట్లకు పైగా ఖర్చుచేసి సొంత భవనానికి హంగులు సమకూర్చుకున్న జగన్‌ను ఏం చేయాలి? అడ్డగోలుగా ఖర్చు చేసిన అధికారులను ఏం చేయాలి?
కళ్లు చెదిరే ఖర్చు..
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆడంబరాల పేరిట జగన్ తన ఇంటి పరిసరాలను, ఇంట్లోని మౌలిక వసతులను జనం సొమ్ముతో మార్చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదే… 2019లో రోడ్లు భవనాల శాఖ ఆయన ఇంటికి అదనపు ఏర్పాట్ల పేరిట రూ.18 కోట్లు ఖర్చు పెట్టింది. 2020లో మరో 10 కోట్లు వ్యయం చేసింది.
తన ఇంటిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై బయట చర్చ జరుగుతుండడంతో.. నిధుల విడుదలకు సంబంధించిన జీవోలు బయటకు రాకుండా చేశారు. దీంతో తాడేపల్లి ఇంటిపై పెట్టిన రూ.28 కోట్ల ఖర్చులో 13 కోట్లకు సంబంధించిన జీవోలు ఇవ్వనే లేదు. వీవీఐపీ సెక్యూరిటీ ఏర్పాట్ల పేరిట ఆర్‌అండ్‌బీతో అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టించారు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్లు, ఆయన హయాంలో చివరి ఏడాది 2024లో 3.50 కోట్లు ఖర్చు చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌లో వివిధ రకాల హంగులు, ఆర్భాటాలు, సెట్టింగుల పేరిట ఈ వ్యయం చేయించిట్లు తెలిసింది. అధికారులు కూడా అత్యుత్సాహం చూపారు.
సీఎం ఇంటిచుట్టూనే మరో ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నంలో గత ఐదేళ్లలో మొత్తం 45.54 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 15 కోట్ల వ్యయానికే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన వ్యయానికి సంబంధించి మెమో, ఇతర రూపాల్లో ఉత్తర్వులు ఇచ్చి నిధులు మంచినీళ్లప్రాయంలా ఖర్చు పెట్టారు. ఖరీదైన సోఫాలు, కుర్చీలు, వీడియో, టెలికాన్ఫరెన్స్ పరికరాలు, ప్లాస్మా, 85 అంగుళాల ఓఎల్ఈడీ టీవీలు, ప్రీమియం కేటగిరీకి చెందిన ఆపిల్ కంప్యూటర్లు, ఇతర సామగ్రిని క్యాంపు ఆఫీసుకు సమకూర్చిపెట్టారు.
అధికారుల అత్యుత్సాహం..
తాడేపల్లిలో జగన్ నివాసం కొత్తదే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ఎన్నికల ముందు 2019లో గృహప్రవేశం చేశారు. కోట్లాది రూపాయల వ్యయంతో అందమైన ప్యాలెస్ నిర్మించుకున్నారు. అదే ఏడాది గద్దెనెక్కాక దానినే సీఎం క్యాంపు ఆఫీసుగా మార్చుకున్నారు. ఆ తర్వాత మూడు రాజధానుల డ్రామాను తెరపైకి తెచ్చారు. అమరావతిలోని సచివాలయానికి వెళ్లకుండా ఇంటినే సీఎం కార్యాలయంగా మార్చేశారు. జగన్ ఆదేశాలతో ఆయన నివాసం, క్యాంపు ఆఫీసు, దాని పరిసరాలను అభివృద్ధి చేసేందుకు నాటి ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడాలేని ఉత్సాహం కనబరిచారు.
జగన్ చెప్పినవి, చెప్పని పనులు కూడా చేసి పెట్టారు. జగన్ కూడా తన ఇంట్లో అసాధారణ సరంజామా ఉండాలని షరతులు విధించారు. నిజానికి ముఖ్యమంత్రి నివాసానికి భద్రత నిమిత్తం, ఇతర అవసరాల పేరిట ఎంత ఖర్చు చేయాలన్నదానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఆర్‌అండ్‌బీలో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి జగన్ సేవలో తరించిపోయారు. బిల్డింగ్ విభాగంలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారు. వీవీఐపీ ఏర్పాట్ల పేరిట గుట్టుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన తర్వాత ఆర్‌అండ్‌బీకి వచ్చిన ఓ జూనియర్ అధికారి కూడా జగన్ మెప్పు పొందేందుకు తాపత్రయపడ్డారు.
ఖర్చుల పద్దు ఇదీ..
జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ ఇంటికి అదనపు హంగులు, రక్షణ ఏర్పాట్లు, సెట్టింగ్‌ల పేరిట ప్రభుత్వం 45.54 కోట్లపైనే ఖర్చు పెట్టింది. ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు రూ.73 లక్షలు ఖర్చు చేశారు. జగన్ 2019 మే 30న సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే ఆయన నివాసం వద్ద 3.66 మీటర్ల రహదారి (పొడవు 1.33 కి.మీ.)ని 10 మీటర్లు వెడల్పు చేసేందుకు రూ.5 కోట్లు ఖర్చు చేశారు. ఆయన రక్షణ కోసం ఆయన ఇల్లు, పరిసరాల్లో తదుపరి చర్యలకు 1.89 కోట్లు ఖర్చుపెట్టారు.
ఇంటి వద్దే ప్రత్యేక హెలిప్యాడ్, దానికి ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్ నిర్మాణానికి రూ.40 లక్షలు, హెలిప్యాడ్ వద్ద గార్డ్ రూమ్, ఇతర సదుపాయాలకు రూ.13.50 లక్షలు, సీఎం నివాసం వద్ద పర్మినెంట్ బ్యారికేడింగ్ ఏర్పాటుకు రూ.75 లక్షలు, సీఎం ఇంటికి సమీపంలోనే పోలీస్బారెక్ సదుపాయాల కోసం రూ.30 లక్షలు, సెక్యూరిటీ పోస్ట్, సెక్యూరిటీ గేట్లు, క్యాబిన్ల ఏర్పాటుకు రూ.31 లక్షలు ఖర్చు చేశారు. అత్యాధునిక విద్యుత వ్యవస్థ, లైట్లు, సీసీటీవీ సదుపాయం, యూపీఎస్ ఏర్పాటు కోసం రూ.3.63 కోట్లు ఖర్చు పెట్టారు. అత్యాఽధునిక విద్యుత టాన్స్‌ఫార్మర్, హెచ్‌టీ లైన్, ఆధునిక లైటింగ్ సిస్టమ్‌కు అదనంగా మరో 97 లక్షలు కేటాయించారు.
అత్యాధునిక ఏసీల ఏర్పాటుకు కోటిన్నర ఖర్చు పెట్టారు. జగన్ ఇంటితో పాటు క్యాంపు ఆఫీసు బయట లైటింగ్ కోసం రూ.11.50 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్ సచివాలయంలోని ఎల్బ్లాక్లో ఉన్న యూపీఎస్‌ను తొలగించి దాన్ని జగన్ ఇంట్లో ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ ఏర్పాటు పేరిట 82.50 లక్షలు కేటాయించారు. అయితే ఆ నిధులను ఇతర అవసరాలకు ఖర్చు పెట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా వ్యూకట్టర్ ఏర్పాటు పేరిట ప్రైవేటు భూమిని సేకరించారు. ఈ భూమికి పరిహారంగా 3.25 కోట్లు విడుదల చేశారు. క్యాంపు ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ సిస్టమ్‌ల కోసం 3.45 కోట్లు ఖర్చు పెట్టారు.
85 ఇంచీల ఓఎల్ఈడీ టీవీల కొనుగోలుకు కోటిన్నరదాకా ఖర్చుపెట్టినట్లు తెలిసింది. ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ ఎక్విప్మెంట్ కోసం మరో 45 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టినట్లు సమాచారం. క్యాంపు ఆఫీసు, ఇంట్లో అవసరాల నిమిత్తం వీవీఐపీ ఏర్పాట్ల పద్దు కింద 4.5 కోట్ల విలువైన సోఫాలు, కుర్చీలు, రిక్లైనర్లు, లాంజ్ సోఫాలు సమకూర్చినట్లుగా ఆర్అండ్బీ అధికార వర్గాలు చెబుతున్నాయి. క్యాంపు ఆఫీసు పరిధిలో జరిగే సమావేశాల కోసం 1.37 కోట్ల విలువైన టేబుల్స్, ఇతర ఫర్నిచర్‌ను సమకూర్చినట్లుగా ఆర్అండ్బీ లెక్కలు చెబుతున్నాయి. ఆలయాల సెట్టింగ్‌ల పేరిట 1.45 కోట్లు, కళాప్రదర్శనలు, ఇతర ఆర్భాటాల పేరిట 1.67 కోట్లు ఖర్చుచేశారు.
ఇంకా జగన్ ఆధీనంలోనే
జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కనీసం ప్రతిపక్షహోదా దక్కించుకునే సీట్లు కూడా రాలేదు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్స్ యాక్ట్-1953 ప్రకారం జగన్ తన ఇంట్లో, క్యాంపు ఆఫీసులో ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకున్న చరాస్తులన్నింటిని వెనక్కి ఇచ్చేయాలి. వాటిని సొంత ఆస్తులుగా వాడుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఏ వస్తువునూ తన వద్ద ఉంచుకోకూడదని చట్టంలోని రెండో క్లాజులో స్పష్టంగా ఉంది.
కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడుస్తున్నా జగన్ ప్రభుత్వ ఆస్తితో జల్సా చేస్తున్నారు. కోట్లు విలువచేసే ఫర్నిచర్, టెక్నికల్, డిజిటల్ ఎక్విప్మెంట్, ఇతర పరికరాలను ఆయన వాడుకుంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన మీటింగ్‌లు పెట్టుకుని వాటిని వాడుకుంటున్నారు. విలువలు, పద్ధతుల గురించి పదేపదే ఉపన్యాసాలు ఇచ్చే జగన్‌కు.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన రాలేదా?
———————————
కళ్లు చెదిరేలా జగన్ క్యాంప్ ఆఫీసు
రుషికొండలో రూ.500 కోట్లతో ఏడు బ్లాకుల నిర్మాణం
మూడు బ్లాకులు ఆయన కుటుంబం నివాసానికే
భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్
ఇద్దరు కుమార్తెలకు చెరో విల్లా సూట్
అనుమతి 4 ఎకరాలకు.. నిర్మాణం 9.8 ఎకరాల్లో
22 ఎకరాల్లో కొండ తవ్వకాలు..
65 ఎకరాల్లో నిర్మాణానికి జీవీఎంసీ క్లియరెన్స్
పర్యాటక రిసార్ట్స్ పేరుతో ప్రారంభః
ప్రభుత్వ నిధులతో తన తాడేపల్లి ప్యాలెస్‌కు సకల హంగులూ సమకూర్చుకున్న జగన్.. తన పరిపాలనా రాజధాని విశాఖలో ఏకంగా అత్యంత విలాసవంతమైన క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నారు. రుషికొండలో పర్యాటక రిసార్ట్స్‌ను అక్రమంగా కూల్చివేసి.. ఎలాంటి అనుమతుల్లేకుండా కొండను తవ్వేసి.. పర్యాటక భవనం పేరిట జల్సా నివాసాన్ని కట్టుకున్నారు. ఆరోపణలు, విమర్శలు ఎదురవుతున్నా ఖాతరు చేయకుండా, నిబంధనలు తుంగలోకి తొక్కి కేవలం రూ.500 కోట్లతో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టారు.
చేయి వేస్తే మాసిపోయేంత వర్ణఛాయలో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో బాత్రూమ్ ఫిటింగ్స్, ఒళ్లు పట్టించుకోవడానికి మసాజ్ (స్పా) రూమ్, సమావేశ మందిరం సైజులో పడక గదులు, 300 మంది గుంపుగా వచ్చినా ఒకరికి ఒకరు తగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు, 200 మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు, ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి లాకర్లు… తన పేషీ కోసం ప్రత్యేకంగా ఒక సెక్రటేరియేట్.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ప్రత్యేకతలే.
వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం… ఇక్కడ నిర్మించిన ఏడు బ్లాకుల్లో మూడు భవనాలు ఆయన వ్యక్తిగత వినియోగానికి ఉద్దేశించినవి. ఒకటి జగన్, ఆయన భార్య భారతీరెడ్డి కోసం. దాని పేరు ప్రెసిడెన్షియల్ సూట్. ఇంకో రెండు విల్లా సూట్స్.. తమ ఇద్దరి కుమార్తెల కోసం నిర్మింపజేశారు. దీనికి విజయనగర బ్లాక్ అని పేరు పెట్టి.. మిగిలిన నాలుగింటికీ కాసింత దూరంగా, ప్రత్యేకంగా సముద్రానికి అభిముఖంగా నిర్మించారు. ఈ బ్లాకుకు ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేశారు. అన్యులెవరూ ఆ గేటు దాటి లోపలికి వెళ్లడానికి అవకాశం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు.
21 ఎకరాల్లో తవ్వామని కోర్టులో అంగీకారం
రుషికొండ మొత్తం 61 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 4 ఎకరాల్లో గతంలో హరిత రిసార్ట్స్ ఉండేవి. దానిని కూలగొట్టి కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తామని అనుమతులు తెచ్చుకున్నారు. అయితే అంతే విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టాలని కోర్టు షరతులు పెట్టినా కొండను 22 ఎకరాల మేర తవ్వి, 9.8 ఎకరాల్లో.. ఏడు బ్లాకులుగా 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతులు నిర్మాంచారు. ఇంకా విచిత్రం ఏమిటంటే… ఇక్కడ 61 ఎకరాల భూమి ఉంటే జీవీఎంసీ 65 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.
దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తుండగా అక్కడ మాత్రం 21 ఎకరాలనే తవ్వినట్టుగా అఫడవిట్ సమర్పించింది. రుషికొండలో ఏడు బ్లాకులు నిర్మించి, వాటికి రాజుల పేర్లు పెట్టారు. మొదటి బ్లాకులో రెండు భవనాలు ఉన్నాయి. వాటికి వేంగి -1 వేంగి -2 అని నామకరణం చేశారు. రెండో బ్లాకుకు కళింగ అని, మూడో బ్లాకుకు గజపతి, ఐదు, ఆరు, ఏడు బ్లాకులకు విజయనగర – 1, 2, 3 అని పేర్లు పెట్టారు.
ఏ బ్లాకులో ఏమున్నాయంటే…
– వేంగి 1(ఏ) బ్లాకులో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్.
– వేంగి 2(బి) బ్లాకులో గెస్ట్ రూమ్‌లు, మీటింగ్ హాళ్లు.
– కళింగ బ్లాక్‌లో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, సమావేశ మందిరాలు.
– గజపతి బ్లాక్‌లో హౌస్ కీపింగ్, కేఫ్టేరియా, బిజినెస్ సెంటర్.
– విజయనగర బ్లాకులోని మూడు భవనాల్లో ఒకటి జగన్, భారతిల కోసం, మిగిలిన రెండు కుమార్తెలకు చెరొకటి.
వసతులు
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు, ఇంటర్నేషనల్ బ్రాండ్లతో ఫిటింగ్స్, మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లు, తాకితే మచ్చలు పడతాయనేలా బంగారు వర్ణంలో బాత్రూమ్ ఫిటింగ్స్ అమర్చారు. నీటి సరఫరా కోసం 100 కిలో లీటర్ల డొమెస్టిక్ సంప్, మరో 150 కిలోలీటర్లతో ఫైర్ సంప్, వ్యర్థజలాల శుద్ధికి 100 కేఎల్డీ సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మించారు.
– విద్యుత్ సరఫరా కోసం కంటెయినర్ సబ్‌స్టేషన్, ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, 1000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, 1010 కేవీఏ సామర్థ్యం కలిగిన మూడు జనరేటర్లు ఏర్పాటు చేశారు.
రుషికొండ ప్యాలెస్ కర్త, కర్మ, క్రియా సుప్రియారెడ్డి
జగన్ విలువలు, విధానాల గురించి తెగ చెబుతారు. వాటిని ఆచరించరు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికలను చట్టాలు, నిబంధనల పేరిట కూల్చడంలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన.. అదే సమయంలో తన అస్మదీయులు, దగ్గరి బంధువులను చేరదీసి పెంచిపోషించారు. నిబంధనలు,చట్టాలు, మార్గదర్శకాలను నిర్దాక్షిణ్యంగా తుంగలోతొక్కి, పర్యావరణాన్ని పణంగాపెట్టి వందల కోట్ల ప్రజాధనంతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. జగన్ అభిరుచికి తగినట్లుగా, భారతీరెడ్డి ఇష్టాలను బట్టి అందమైన డిజైన్లు, ఇంటీరియర్‌ను రూపొందించింది ఎవరో తెలుసా? చెవ్వా సుప్రియారెడ్డి.
ఆమె జగన్, భారతిరెడ్డిలకు అతి సమీప బంధువు. జగన్ వద్ద ఐటీ సలహాదారుగా ఉన్న దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి భార్య ఈమె. జగన్ తరఫున ఇసుక వ్యాపార సామ్యాజ్యాన్ని నడి పిన ఆయన సోదరుడు వైఎస్ అనిల్‌రెడ్డికి సమీపబంధువు. ఆమెది, జగన్‌ది ఒకే ఊరు. పులివెందుల భాకరాపురంలో వారివి పక్కపక్క ఇళ్లే. సుప్రియారెడ్డికి చెందిన పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకే రుషికొండ టూరిజం ప్రాజెక్టు డిజైన్స్, ఆర్కిటెక్చువల్, ఇంటరీయర్ ప్రాజెక్టును ఇచ్చారు. ఒక్క రుషికొండనే కాదు, రాష్ట్రంలోని టూరిజం ప్రాజెక్టులన్నీ ఈ సంస్థకే అప్పగించినట్లుగా జగన్ ప్రభుత్వం ఓ నోట్‌ఫైల్‌లో పేర్కొంది.
ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన వర్క్ ఇచ్చారు? ఆ సంస్థకున్న అర్హతలు, అనుభవం ఏపాటివో ఎవరికీ తెలియదు. అసలు ఆ సంస్థకు టెండర్ ఎలా ఇచ్చారో కూడా శాఖలో ఉన్నవారికి కూడా తెలియదు. కానీ ఆ సంస్థే రుషికొండ ప్రాజెక్టులో కర్త, కర్మ, క్రియగా నిలిచింది. ఖర్చుపెట్టిన 500 కోట్లలో సుప్రియారెడ్డికి చేరింది ఎంత? నికరంగా ప్రభుత్వం రుషికొండపై ఖర్చుపెట్టినదెంతో తేలాలంటే సర్కారు సిట్‌తో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని పర్యావరణ, ఆర్థికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. జగన్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ప్యాలెస్‌లకు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్స్, ఇంకా అదనపు హంగులు అద్దినది సుప్రియారెడ్డే.
అయితే అప్పటికి ఇంకా ఆమెకు ప్రత్యేకంగా కంపెనీ లేదు. 2019లో మేలో జగన్ అధికారంలోకి వచ్చాక తాడేపల్లిలోని తన ప్యాలెస్‌ను క్యాంపు ఆఫీసుగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఆగస్టులోనే సుప్రియారెడ్డి డైరెక్టర్‌గా పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇందులో ఆమె భర్త దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి, మరో వ్యక్తి డైరెక్టర్లుగా న్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ను పూర్తిస్థాయి క్యాంపు ఆఫీసుగా మార్చాక, అందులో ఆర్కిటెక్చువల్, ఇంటీరియర్ డిజైన్స్ ఆమె చేశారు. సెక్యూరిటీ ఏర్పాట్ల పేరిట కేటాయించిన నిధులను ఇంటీరియర్ డిజైన్‌కోసం వినియోగించారు.
జగన్ వ్యక్తిగతంగా తన ఇంటి నిర్మాణం, డిజైన్స్ పనులను సుప్రియారెడ్డికి ఇచ్చుకోవచ్చు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ రుషికొండ ప్రాజెక్టు ప్రభుత్వానిది. జగన్ సొంత ఆస్తికాదు. ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా ఒకరికి అప్పగించాలంటే నిర్దిష్టమైన నియమ నిబంధనలు, చట్టబద్ధమైన మార్గదర్శకాలు ఉంటాయి. టెండర్లు పిలవాలి. అర్హత ఉన్న కంపెనీలను ఎంపిక చేయాలి. ఆ తర్వాతే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. మరి సుప్రియారెడ్డికి చెందిన పాంథియన్ డిజైన్స్ ఇండియా కంపెనీకి ఏ ప్రాతిపదికన రుషికొండ ప్రాజెక్టు అప్పగించారు? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న.
నిజానికి రుషికొండ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజె క్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసేందుకు టెండర్లు పిలవగా ఆర్వీ అసోసియేట్స్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ కన్సల్టెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దక్కించుకుంది. ప్రాజెక్టు వ్యయంలో 3 శాతం ఫీజుగా ఆ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం ఉంది. మరి పాంథియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఎలా ఎంపిక చేశారు? టెండర్లు పిలిచారా? నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చారా? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. జగన్‌రెడ్డి, భారతిరెడ్డిలకు సమీప బంధువు అన్న కారణం తప్ప మరేకోణం కనిపిచడం లేదు.
అందాలకోసం 120 కోట్లపైనే..
రుషికొండ ప్యాలెస్ బడ్జెట్ ఎంత? తొలుత ఎన్ని కోట్లతో నిర్మించాలనుకున్నారు? ఆ తర్వాత ఎన్ని కోట్లకు చేరిందో తెలిస్తే జగన్ అభిష్టాల విలువ ఎంత ఖరీదో తెలిసిపోతుంది. ఫేజ్1-, ఫేజ్2 భవనాల నిర్మాణంకోసం 120 కోట్లు వ్యయమవుతుందని అంచనావేశారు. కానీ ఇప్పుడు మొత్తం వ్యయం 450 కోట్లపైమాటే. ఆర్కిటెక్చువల్, ఇంటీరియర్ డిజైన్స్, వాటికి తగిన కొనుగోళ్లు, ఇంకా డెకరేషన్స్ కోసం 120 కోట్లపైనే ఖర్చుపెట్టినట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్లో 100 రూపాయలకు దొరికే వస్తువును అంతర్జాతీయ ప్రమాణాల పేరుచెప్పి వెయ్యిరూపాయలపైనే కొనుగోలు చేయించినట్లు చెబుతున్నారు.
ఒక వెస్ట్రన్ టాయిలెట్ ఖరీదే 3.65 లక్షలు, బాతటబ్ ఖర్చు 2.75 లక్షలపైనే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ప్యాలెస్‌లో వాడిన కర్టెన్లు, వాటి పరికరాల ఖర్చు 10 కోట్లపైనే ఉంటుందని చెబుతున్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారు, ఆయన, భారతిరెడ్డి కుటుంబమే రుషికొండ ప్యాలెస్‌లో నివాసం ఉంటారు, క్యాంపు ఆఫీసు ఇక్కడే ఉంటుందన్న ధీమాతో ప్రభుత్వ సొమ్మును మంచినీళ్లప్రాయంలా ఖర్చుపెట్టించారు. ఇప్పటి వరకు అక్కడ ఎంత ఖర్చుపెట్టారు? ఏ కేటగిరీలో ఎంత వ్యయం చేశారో ఆటింగ్ జరగ లేదు.
ఏ పనికి ఎంత మేర నిధులు వాడాల్నో పరిమితి లేదు. దీంతో అడిగినంతగా ఇచ్చేశారు. నచ్చినట్లుగా పరికరాలు కొన్నారు. ప్రజాధనాన్ని, పర్యావరణాన్ని పణంగాపెట్టి రుషికొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. దీనిపై జాతీయ మీడియాలో కూడా వార్తలు రావడంతో జగన్ అండ్ కో కిక్కురుమనడం లేదు.