ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం, అమరావతి పరిరక్షణ కోసం అమరావతి రైతులు మహా పాదయాత్ర 2.0 ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి హాజరయ్యారు. పాదయాత్రలో స్వయంగా పాల్గొని కొద్దిదూరం నడిచిన రేణుకా చౌదరి…జగన్ సర్కార్ పై మండిపడ్డారు. ‘పుష్ప’లో అల్లు అర్జున్ మాదిరిగా డైలాగు చెప్పి రైతుల్లో ఫుల్ జోష్ నింపారు.
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని జగన్ ప్రకటించే వరకు తగ్గేదేలే అంటూ జగన్ కు సవాల్ విసిరారు రేణుకా చౌదరి. అంతేకాదు, పుష్పలో హీరో అల్లు అర్జున్ మాదిరిగా రేణుకా చౌదరి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వైరల్ అయ్యాయి. రేణుకా చౌదరి పుష్ప డైలాగ్తో అమరావతి రైతుల్లో ఉత్సాహం రెట్టింపయింది. అమరావతి పాదయాత్ర 1.0కు కూడా రేణుకా చౌదరి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కీలక సమయాల్లో రైతుల ఉద్యమంలో ఆమె స్వయంగా పాల్గొన్నారు.
ఈసారి కూడా రైతులకు మద్దతుగా వచ్చానని, మళ్లీమళ్లీ వస్తుంటానని రేణుకా చౌదరి అన్నారు. జగన్ మూర్ఖపు పాలన చేస్తున్నారని ఈ ఫైర్ బ్రాండ్ ఫైర్ అయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని ఆమె గుర్తు చేశారు. అమరావతికి మద్దతుగా నిలుస్తామని, అండగా ఉంటామని మోదీ చెప్పారని, ఇప్పుడాయన ఏమయ్యారని నిలదీశారు. గతంలో, అది అమరావతి కాదు, భ్రమరావతి, కమ్మరావతి అని వైసీపీ నేతలు విమర్శించడంపై కూడా రేణుకా చౌదరి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.
కాగా, రెండో రోజు మహా పాదయాత్ర కొనసాగుతోంది. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర దుగ్గిరాల వరకు 18 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ పాదయాత్రకు ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్, సీపీఐ నారాయణ తదితరులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు, ఈ పాదయాత్రలో పాల్గొంటున్న 600 మందికి ఐడీ కార్డులివ్వాలని పోలీసులు నిర్ణయించారు.
Comments 1