వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. పశ్చిమ బంగాలో సువేందు అధికారి ఫలితం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ మేరకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. సీఎం ఇలాకా గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ముందే చెప్పానన్న ఈటల.. ఇందుకోసం గజ్వేల్లో సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాటామంతిలో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల పేర్కొన్నారు. పశ్చిమ బంగాలో సువేందు అధికారి దృశ్యం.. తెలంగాణలో పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. బంగాల్లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలని వ్యాఖ్యానించారు.
“గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని ముందే చెప్పాను. ఇందుకోసం గజ్వేల్లో సీరియస్గా వర్క్ చేస్తున్నా. కేసీఆర్ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సువేందు అధికారి దృశ్యం తెలంగాణలో పునరావృతం అవుతుంది. బంగాల్లో మాదిరిగానే ముఖ్యమంత్రిని ఇక్కడ ఓడించాలి.”
మరోవైపు కేసీఆర్ సర్కారు గిరిజన మహిళలపై దాడులకు పాల్పడుతోందని ఈటల ఆరోపించారు. ఓవైపు బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి పదవిని కట్టబెడితే.. కేసీఆర్ ప్రభుత్వం గిరిజన మహిళలపై చేయి చేసుకుంటోందని మండిపడ్డారు. గిరిజనుల పట్ల కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అసహ్యించుకునేలా ఉందన్నారు. సీఎం తన 8 ఏళ్ల పాలనలో ఒక ఎకరం అసైన్డ్ భూమినీ పంచలేదని విమర్శించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసి.. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను సేకరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకే గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల విషయంలో దళితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.
బీజేపీ ఎస్టీ మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశమిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం గిరిజన మహిళలపై దాడులు చేస్తోంది. సీఎం గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానవీయం. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో ఎకరం అసైన్డ్ భూమి పంచలేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను సేకరిస్తున్నారు. అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కరించాలి అని ఈటల డిమాండ్ చేశారు.
Comments 1