తెలంగాణ కోసం పోరాడిన నేతల పేర్లు చెబితే అందులో ఈటల రాజేందర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. వివాదరహితుడిగా.. టీఆర్ఎస్ పార్టీ పట్ల కమిట్ మెంట్ ఉన్న నేతగా.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన.. అందుకు భిన్నంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే.
కేసీఆర్ కు ఈటలకు మధ్య గ్యాప్ రావటానికి ప్రధాన కారణం ఏమిటన్న విషయం మీద ఇప్పటివరకు స్పష్టంగా చెప్పినోళ్లు లేరు. ఆ మాటకు వస్తే ఈటల రాజేందర్ సైతం.. ఆత్మాభిమానం.. ఆత్మగౌరవం అంటున్నారే కానీ.. అసలు కారణాన్ని మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు కాకున్నా.. భవిష్యత్తులో అయినా అది రివీల్ అవుతుందనుకోండి.
భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటలపై వేటు వేయటం ద్వారా..కొత్త ఆటను షురూ చేశారు కేసీఆర్. తనను పిలిపించి.. తప్పు చేశావు.. మంత్రి పదవికి రాజీనామా చేయమని అడిగితే సరిపోయేదానికి.. ఇంత అవమానకరంగా తన పట్ల వ్యవమరిస్తారా? అని ఈటల ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో అట్టే కాలం కొనసాగరని చెప్పక తప్పదు. దీనికి తగ్గట్లే.. ఏ పార్టీలో చేరాలన్న విషయంపై ఆయన భారీ కసరత్తే చేస్తున్నారు.
కాంగ్రెస్ తో పోలిస్తే.. బీజేపీలోకి చేరేందుకే ఈటలకు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో చేరితే తప్పించి.. కేసీఆర్ సర్కారు నుంచి ఆయన రిలీఫ్ ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కమలం పార్టీలో చేరేందుకు ఈటల మానసికంగా సిద్ధమైనప్పటికి.. కోదండరాంతో పాటు.. కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు.. మరికొన్ని ఉద్యమ సంస్థలు ఈటలను బీజేపీలోకి చేరొద్దని సలహా ఇస్తున్నాయి. దీంతో.. ఆయన ఏ నిర్ణయాన్ని తీసుకోవాలా? అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తొలుత అనుకున్నట్లు కాకుండా.. తన మీద పార్టీ వేటు వేసే వరకు వెయిట్ చేయకుండా.. తానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఇందుకు తగిన ముహుర్తాన్ని ఆయన ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావదినోత్సవమైన జూన్ 2న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కేసీఆర్ పై వార్ డిక్లేర్ చేస్తారని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే పార్టీకిరాజీనామా చేయటం.. కొత్త పార్టీలో చేరటం అంతా ఒకే రోజు జరుగుతుందంటున్నారు.
ఒకవేళ బీజేపీలో చేరే విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగితే మాత్రం తన ఎమ్మెల్యే పదవికి జూన్ 2న రాజీనామా ఖాయమన్న మాట వినిపిస్తోంది.