తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరమనిషి అనడంతో దుమారం రేగింది. స్పీకర్ కు ఈటల క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. తాను క్షమాపణ చెప్పబోనని ఈటల అన్నారు. దీంతో, ఈటలను తెలంగాణ అసెంబ్లీ నుంచి స్పీకర్ సస్పెండ్ చేయడం గందరగోళానికి తెరతీసింది. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ పోచారం వెల్లడించారు.
అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బయటకు వచ్చిన ఈటల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ వాహనం ఎక్కేందుకు ఈటల నిరాకరించారు. తన సొంత వాహనంలోనే ఇంటికి వెళ్తానని చెప్పారు. కానీ, ఈటల మాటలు పట్టించుకోని పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకువెళ్లారు. షామీర్ పేట్ లోని ఈటల నివాసం వద్ద ఆయనను పోలీసులు వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా పోలీసులపై ఈటల ఫైర్ అయ్యారు. బానిసల మాదిరిగా బతకొద్దంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై ఈటల నిప్పులు చెరిగారు. తన వినాశనానికే కేసీఆర్ ఇదంతా చేసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాదిగా తనపై కేసీఆర్ ఎన్నో కుట్రలు చేస్తున్నారని, ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినప్పటి నుంచి తనను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతైన తన గొంతు నొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కానీ, కేసీఆర్ ను గద్దె దించే వరకు విశ్రమించబోనని ఛాలెంజ్ చేశారు.
మరోవైపు, తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు, ఉపాధ్యాయ సంఘాల సహా ఏడు సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి. దీంతో హైదరాబాద్లోని ఇందిరాపార్క్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పే స్కేల్ ప్రకారం తమకు జీతాలు ఇస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ హామీ ఇచ్చారని. కానీ, ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని వీఆర్ఏలు మండిపడ్డారు.
తమను ఇతర శాఖలో చేరుస్తామని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ చేసిన ప్రకటనపై కూడా వీఆర్ఏలు ఫైర్ అయ్యారు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్ఏలు, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.