తెలంగాణలో సీనియర్ పొలిటిషియన్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట తీవ్ర విషాదం ఏర్పడింది. ఈటల రాజేందర్ కు పితృవియోగం కలిగింది. శతాధిక వృద్ధుడు, ఈటల తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఈటల మల్లయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈటల మల్లయ్యను సిద్ధిపేటలోని ఆర్వీఎం హాస్పిటల్లో చేర్పించి కొంతకాలంగా చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి మల్లయ్య బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆ తర్వాత ఈటల మల్లయ్య మృతి చెందారని డాక్టర్లు ప్రకటించారు. మల్లయ్య మరణ వార్తను ఈటల రాజేందర్ ట్విటర్ లో స్వయంగా వెల్లడించారు. కమలాపూర్‌లోని తమ స్వగృహంలో తన తండ్రి మల్లయ్య పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచామని, బుధవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ట్వీట్ చేశారు.
ఈటల మల్లయ్యకు 8 మంది సంతానం. వారిలో ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. మల్లయ్య రెండో కుమారుడైన ఈటల రాజేందర్ చాలాకాలంపాటు టీఆర్ఎస్లో కీలక నేతగా పని చేశారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన ఈటల బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక, అమిత్ షా టూర్ ల నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈటల బిజీగా ఉన్నారు.
తండ్రి మల్లయ్య ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసిన వెంటనే ఈటల హాస్పిటల్‌కు వెళ్లారు. మంగళవారం మొత్తం అక్కడే ఉండి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి మల్లయ్య మరణించారని తెలియడంతో ఆయన స్వగ్రామానికి వెళ్లారు. దశదిన కర్మ పూర్తయ్యేవరకు ఈటల రాజేందర్ అక్కడే ఉంటారు.
Comments 1