గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సీనియర్ నేతలు ఈటల రాజేందర్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు మరోసారి అలాంటి చర్చకు మరింత ఊపు తెచ్చేలా వ్యవహరించారు. పార్టీ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి డుమ్మా కొట్టటం ద్వారా.. ఈటల.. కోమటిరెడ్డిల ఏం చేయనున్నారన్న విషయంపై కాస్తంత క్లారిటీ ఇచ్చినట్లుగా చెప్పాలి. ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రోజు వ్యవధిలో 35 లక్షల మందిని కలిసే భారీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీకి చెందిన ముఖ్యనేతలు మొదలు సాధారణ కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు రావటం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమానికి బీజేపీ ముఖ్యనేతలైన ఈటల రాజేందర్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఇద్దరు దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో పార్టీ తీరుపై ఈ ఇద్దరు నేతలు గుర్రుగా ఉన్నారని.. తమకు లభించాల్సినంత గౌరవ మర్యాదలు లభించటం లేదన్న మాట తమ సన్నిహితుల వద్ద ఈ ఇద్దరు నేతలు ప్రస్తావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
త్వరలో రాజకీయంగా కీలకనిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్దమవుతున్న ఈ ఇద్దరు నేతలు.. బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా తాజా పరిణామాలు ఉన్నాయని చెప్పాలి. ఇంటింటికీ బీజేపీ ప్రోగ్రాంకు ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారంటే.. వారు కమలం పార్టీకి దూరమైనట్లేనని చెబుతున్నారు. బీజేపీ కల్చర్ కు భిన్నంగా పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించిన లీకులు ఇవ్వటం ద్వారా.. ఈ మధ్యన బీజేపీలో సంచలనంగా మారటం తెలిసిందే.
ఇందులో ఈ ఇద్దరి నేతల ప్రమేయం ఉందంటున్నారు. దీనిపై బీజేపీ అగ్ర నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. పార్టీ నుంచి బయటకు వెళ్లే క్రమంలో ఇలాంటి చేష్టలు ఈ ఇద్దరు నేతలు చేస్తున్నట్లుగా సమాచారం. తాజాగా కీలక కార్యక్రమానికి గైర్హాజరు కావటంతో.. వారిద్దరు పార్టీకి దూరమైన విషయాన్ని చేతల్లో చూపించారంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.