భారీ వర్షాలు.. అంతనే పోటెత్తిన వరదలతో హైదరాబాద్ మహనగరం ఎంత తీవ్రంగా ప్రభావితం అయ్యిందో తెలిసిందే. లక్షలాది కుటుంబాల్ని ప్రభావితం చేసిన వరదల నేపథ్యంలో.. సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. దీంతో.. పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
టాలీవుడ్ ప్రముఖులతో పాటు.. ప్రముఖ వ్యాపార సంస్థలు.. వివిధ వర్గాలకు చెందిన వారు తమకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇలాంటి వేళ.. తెలుగు ప్రజలకు సుపరిచితులు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ సైతం తన వ్యక్తిగతంగా దాచుకున్న సేవింగ్స్ నుంచి రూ.25వేల విలువైన మొత్తాన్ని తానెంతో ప్రేమించి.. అభిమానించే తెలంగాణ ప్రజలకు విరాళంగా ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. తనకున్నంతలోనే విరాళాన్ని ఇచ్చే పెద్ద మనసు నటుడు సంపూర్ణేశ్ బాబు సొంతం. తాజాగా హైదరాబాద్ వరదల నేపథ్యంలో స్పందించిన ఆయన.. మంత్రి హరీశ్ ను కలిసి రూ.50వేలమొత్తాన్ని ఆర్థిక సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. సిద్దిపేట బిడ్డగా సంపూర్ణేశ్ బాబు పెద్ద మనసును హరీశ్ పొగిడేశారు.
ఇక్కడితో విషయం పూర్తి కాలేదు.
సుదీర్ఘకాలం గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రూ.25వేలు ప్రకటించటం.. తనకొచ్చే కొద్దిపాటి అవకాశాలతో బతుకుబండి లాగే సంపూర్ణేశ్ బాబు లాంటి ఒక నటుడు రూ.50వేల మొత్తాన్ని ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు విరాళాల మీద సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంత పెద్ద మనిషి తెలంగాణకు ఇచ్చే సాయం రూ.25వేలా? అంటూ పలువురు తప్పు పడుతున్నారు. విరాళం ఇవ్వకుంటే మాత్రం ఎవరు అడిగారు? నరసింహన్ లాంటి వ్యక్తి ఇలా విరాళాన్ని ప్రకటించటమా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి విరాళం ఇచ్చి మరీ.. వేలెత్తి చూపించుకునేలా చేశారన్న మాట పలువురి నోటి వినిపిస్తుండటం గమనార్హం.