వైఎస్ వివేకా హత్య కేసులో ఏ-1గా ఎర్ర గంగిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2019లో ఎర్ర గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల కాలంలో వివేకా హత్య కేసు విచారణ వేగవంతమైన నేపథ్యంలో తాజాగా గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు, మే 5వ తేదీ లోపు సీబీఐ కోర్టులో ఎర్ర గంగిరెడ్డి లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. బెయిల్ పై బయట ఉన్న గంగిరెడ్డి వివేకా కేసులో కీలక సాక్ష్యులను బెదిరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుందని, ఈ సమయంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్ పై ఉంటే ఈ కేసులో కీలక సాక్షులను ప్రలోభ పెట్టి కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు వెల్లడించింది.
గంగిరెడ్డి వంటి కీలకమైన వ్యక్తి బయట ఉంటే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మే 5వ తేదీ లోపు సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోక పోతే ఆయనను అరెస్టు చేయవచ్చని సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది.
కాగా, 2019లో వివేకా కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 90 రోజులలోపు గంగిరెడ్డిపై అఫిడవిట్ దాఖలు చేయలేదు. దీంతో, సాంకేతిక కారణాల వల్ల గంగిరెడ్డికి బెయిల్ లభించింది. 2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.