వైసీపీ హయాంలో కోడి కూయక ముందే పెన్షన్ ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. కొందరు వాలంటీర్లయితే వందల కిలోమీటర్లు ప్రయాణించి మరీ పెన్షన్ అందిస్తున్నారని, ఇటువంటి అద్భుతమైన పాలన కేవలం జగన్ కే సాధ్యమని గొప్పలు చెప్పారు. అప్పట్లో జగన్ జపం చేస్తున్న వైసీపీ అనుకూల ప్రభుత్వ ఉద్యోగి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయాస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సహజంగానే ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గతంలో మాదిరిగానే చేస్తున్న పెన్షన్ల పంపిణీ ఆయనకు నచ్చడం లేదు.
అసలు అంత పొద్దు పొద్దున్నే నిద్ర పోతున్న వారిని లేపి పెన్షన్లు ఇవ్వడం అవసరమా అంటూ వెంకట్రామిరెడ్డి తాజాగా చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. 5 గంటలకు పెన్షన్ ఇస్తున్నారని, 3 గంటలు లేటైతే ప్రపంచం తల్లకిందులైపోతుందా? అని ఆయన ప్రశ్నించిన వైనం వివాదాస్పదమైంది. వేరే ఊర్లో ఉన్న ఉద్యోగి ఎన్ని గంటలకు లేచి వచ్చి తెల్లవారుజామునే పెన్షన్లు పంపిణీ చేయాలని, ఆ సమయంలో ప్రయాణం ప్రమాదకరమని అంటున్నారు. ఇక, సమీక్షలు జరిగేటపుడు కిందిస్థాయి అధికారులను, ఉద్యోగులను ఉన్నతాధికారులు తిడుతున్నారని అన్నారు. అటువంటి వారిని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు.
ఇక, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆఫీసులకు వస్తే వారికి టీ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి పని చేసి పంపకుంటే మీ సంగతి చూస్తామని మంత్రులు వార్నింగ్ ఇస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఉద్యోగులను గౌరవించడం లేదని, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా పని వాతావరణం కల్పించడం లేదని వెంకట్రామిరెడ్డి విమర్శించారు.
అయితే, వైసీపీ హయాంలో మాదిరిగానే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని, ఆ సమయంలో ప్రశ్నించని వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారో తెలియడం లేదని నెటిజన్లు అంటున్నారు. ఇక, వైసీపీ నేతలు చేసిన భూ సెటిల్మెంట్లు..ఉద్యోగులను..ప్రత్యేకించి ప్రభుత్వ ఉపాధ్యాయులను పెట్టిన ఇబ్బందులు వెంకట్రామిరెడ్డి మరిచిపోయారని, అందుకే ఆయన మద్దతునిచ్చిన వైసీపీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైందని సెటైర్లు వేస్తున్నారు.