ఒక ఉద్యోగికి వారం కాకపోతే పదిహేను రోజులు జీతం రాకపోయినా సర్దుకోవచ్చు. అలా సర్దుకోలేక పోతే అతని ఆర్ధిక పరిస్థితి బాగా లేదని చెప్పాలి.
అలాగే ప్రభుత్వమే కావచ్చు, ఒక ప్రైవేటు సంస్థ కావచ్చు తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి నిధుల కొరత ఏర్పడటం అంటే ఏమంటారో మీకు క్లారిటీ లేదనుకుంటా! ఇదే పరిస్థితి లో ఒక ప్రయివేట్ కంపెనీలో ఉంటే దివాళా అంచున ఉందని అంటారు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి నిల్వ లేకపోయినా వేస్ & మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ పవర్, ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాలతో మొత్తం జీతాలు, పెన్షన్ లు చెల్లించవచ్చు.
అలాగే స్టేట్ డెవలప్మెంట్ బాండ్స్ జారీ చేయడం ద్వారా బహిరంగ మార్కెట్ల నుండి రుణాలు సేకరించ వచ్చు.
కానీ, అన్ని అవకాశాలు మూసుకు పోయాయి అనేది ఎలాంటి పరిస్థితి అనేది గ్రహించండి.
ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి పబ్లిక్ అకౌంట్ కి చెందిన చెల్లింపులు నెలల తరపడి పెండింగ్ ఉంచటం.
GPF, APGLI, NPS, ZPPF, లోకల్ బాడీ ఫండ్స్, PD అకౌంట్స్ దీనిలో ఉండే నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి కాదు.
ఇక్కడ ప్రభుత్వం ఒక బ్యాంకర్ రోల్ మాత్రమే ప్లే చేస్తోంది. మన అకౌంట్ల లో ఉన్న నిధులు బ్యాంకు మనకు కావాల్సినపుడు ఇవ్వలేకపోతే ఏమనాలి?
ఉదాహరణకు ఆర్ధిక సంఘం నిధులు కేంద్రం స్థానిక సంస్థలకు విడుదల చేస్తుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పీడీ అకౌంట్లలో జమ అవుతాయి. వీటి నుండి ఒక చెక్కు ఇస్తే నెలల తరపడి పెండింగ్. మీ అకౌంట్ లో ఎవరైనా డబ్బులు వేసినప్పుడు మీరు తీసుకుందామని వెళితే ఇప్పుడు కాదు ఒక నెల రోజులు ఆగి తీసుకోండి. బ్యాంకుకి కొంచెం కష్టాలు ఉన్నాయి అని అంటే మనం ఏమని అర్ధం చేసుకోవాలి.
ఒక పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చేయాల్సిన 40, 50 లక్షల మొత్తం 4 నుండి 6 నెలల ఆలస్యంగా చెల్లింపులు అవుతున్నాయి. ఆ మొత్తం సేవింగ్స్ అకౌంట్లో ఉంటేనే ఎంత వడ్డీ వస్తుందో మీరే చెప్పండి.
ఈ నాలుగు, ఆరు నెలల కాలానికి ప్రభుత్వం వడ్డీ ఇవ్వదు. బ్యాంకు ఇవ్వదు? ఎవరిస్తారు?
సరెండర్ లీవులు, జిపిఎఫ్, APGLI లోన్లు, మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్లు ఎన్ని నెలలకి పడుతున్నాయో మీకు అవగాహన ఉందా?
ఒకప్పుడు ఫెస్టివల్ అడ్వాన్సులు నాన్ గజైటెడ్ అందరూ తీసుకునే వారు. ఇప్పుడు 10% కూడా తీసుకోవడం లేదు (బడ్జెట్ నియంత్రణ పెట్టడం వల్ల).
ఆ తీసుకున్న వాళ్లకు కూడా దసరాకి పెడితే ఉగాది కి క్రెడిట్ అవుతున్నాయి. ఇక దీర్ఘ కాలిక లోన్లు, LTC వంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయం పుస్తకాల్లో తప్ప వాస్తవం లో ఉద్యోగులు మర్చిపోయారు.
ఇది చాలదన్నట్లు అకౌంట్లో పడని DA ఏరియర్ బిల్లులకి ఆదాయపు పన్ను కోత కూడా ఆదనపు బెనిఫిట్.
30 నెలల ఆలస్యంగా మూడు వాయిదాలలో చెల్లిస్తామని ఇచ్చిన బిల్లులు పాస్ అయి మరో మూడు నెలలు గడిచిపోయాయి.
ఇప్పటికీ వాటి పరిస్థితి ఏమిటో తెలీదు. మరో DA వాయిదా సమయం వచ్చింది కానీ పాత DA కె ఇంకా మోక్షం రాలేదు.
ఇక 36 నెలలు గడిచినా PRC ఊసే లేదు.
ఇక ఆఫీస్ అవసరాల కోసం ఖర్చు చేసిన TA, కంటింజెంట్ బిల్లులలో సగం కూడా రావటం లేదు. ఆ వచ్చే సగం కూడా ఆర్నెళ్లకో, ఏడాదికో?
జీతం వారం రోజులు ఆలస్యం కాదు. ఉద్యోగులకి సంబంధించిన అన్నీ ఇప్పటికే అయిపోయాయి. ఇప్పుడు జీతం కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.