పీఆర్సీ వ్యవహారంపై ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు చేపట్టిన చలో విజయవాడ విజయవంతమైన సంగతి తెలిసిందే. విజయవాడకు లక్షలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు…తమ డిమాండ్ల నెరవేరేవరకు పోరాడతామని తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రభుత్వంపై ఉద్యోగులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘా నేతలు…జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేత హోదాలో ఇప్పటి సీఎం జగన్ తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని, అలాగే పీఆర్సీ, డీఏలు సకాలంలో అందిస్తామని మాట ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. అంతేకాదు, ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీల రికార్డింగ్ ను మైక్ ముందు పెట్టి వినిపించారు. ఆనాడు హామీలిచ్చిన జగన్ సాంకేతిక సమస్యను సాకుగా చూపి సీపీఎస్ రద్దు సాధ్యంకాదని చెప్పడం భావ్యం కాదని వారు మండిపడ్డారు.
జగన్ చెప్పినట్టు పీఆర్సీ, డీఏలు సకాలంలో రాలేదని, సీపీఎస్ రద్దు జరగలేదని ఓ నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ”సీపీఎస్ రద్దు ఎందుకు చేయలేదు…దొంగ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చావు…సీఎం కావడం కోసం నుదిటి మీద ముద్దులు పెట్టుకుంటూ చేతులు ఊపుకుంటూ తిరిగావు…. సీపీఎస్ రద్దు చేస్తారా…గద్దె దిగుతారా….”అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనక్కు తగ్గేదేలేదంటూ తేల్చి చెప్పారు. దీంతో, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెజవాడ సభలో జగన్ పరువు తీసిన ఉద్యోగి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.