ఎన్నికలకు ముందు ఏపీలో సీన్ మారిపోతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ మరోసారి కుర్చీని దక్కించుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన దూకుడు నిర్ణయాలతోనూ ముం దుకు సాగుతోంది. ఇంతలో ఎన్నికలకు మూడు మాసాల ముందు అధికార పార్టీకి చెమటలు పట్టించే పరిస్థితి రాష్ట్రంలో తెరమీదికి వచ్చింది. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతగా పాదయాత్ర చేసిన జగన్ .. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనికోరుతూ.. పలు సంఘాలు ఆందోళన బట్టాయి.
గత వారం కిందట అంగన్వాడీ ఆయాలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. తమ వేతనాలను పొరుగు రాష్ట్రం తెలం గాణ కంటే కూడా.. రూ.1000 అదనంగా ఇస్తానని జగన్ చెప్పారని అంటున్నారు. ఈ డిమాండ్ సాధన కోసం ఇప్పుడు గత వారం రోజులుగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు చర్చలు జరిపినా.. ఫలించలేదు. ఎన్నికలకు ముందు.. అంగన్వాడీలు చేస్తున్న ఈ నిరసన.. పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక, ఆశావర్కర్లు కూడా మంగళవారం నుంచి రాష్ట్రంలో ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇది నిరవధికంగా సాగుతుందని చెబుతున్నారు. తమకు కూడా వేతనాలు పెంచుతామని అన్నారని.. పర్మినెంట్ చేస్తామని చెప్పారని.. కానీ, తమకు ఎలాంటి జీతం పెంపులేకుండా పోయిందని వారు అంటున్నారు. ఇక, పనిభా రం తగ్గించాలనేది వీరి డిమాండ్. దీంతో ఈ రెండు వర్గాల్లో మహిళలే ఎక్కువగా ఉండడం.. మహిళా ఓటు బ్యాంకుపైనే వైసీపీ ఆశలు పెట్టుకోవడంతో పరిస్థితి తేడా కొడుతుందా? అనే చర్చ సాగుతోంది.
ఇదిలావుంటే ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థలోనూ నిరసనల ముసలం తెరమీదికి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. నాలుగు లక్షల మందిని వలంటీర్లుగా తీసుకుంది. వీరికి గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే.. ఇప్పుడు వీరు కూడా.. తమను పర్మినెంట్ చేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల మాదిరిగా తమను కూడా చూడాలని.. వేతనాలు 20 వేలుఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మరి దీనిని వైసీపీ ఎలా టేకిల్ చేస్తుందో చూడాలి.