అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు తప్పులు చేసే అవకాశం ఉండదన్న భావన చాలామందిలో ఉంటుంది. కానీ.. వారు కూడా మిగిలిన వారు మాదిరే. ప్రపంచంలో అత్యుత్తమ ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యాపిల్ లాంటి కంపెనీకి చీఫ్ గా వ్యవహరించే వ్యక్తి తప్పులు చేస్తారా? కారుచౌకగా వచ్చిన ఒక డీల్ ను నో చెప్పారా? ఇప్పుడా కంపెనీ.. ప్రపంచ అత్యుత్తమ 500 కంపెనీల్లో ఒకటిగా మారిందా? అంటే అవునని చెబుతున్నారు.
ఇంతకీ ఆ మాటలు చెప్పిందెవరో తెలుసా? టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. ఒక దశలో దివాలకు చేరువైన కంపెనీని యాపిల్ కు అతి తక్కువ ధరకు అమ్మేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే.. అందుకు యాపిల్ చీఫ్ టిమ్ కుక్ నో చెప్పేశారట. ఈ విషయాన్ని తాజాగా ఎలాన్ వెల్లడించారు. ప్రపంచంలో అత్యుత్తమ 500 కంపెనీల్లో చోటు దక్కించుకున్న మర్నాడు ఈ ఆసక్తికర విషయాన్ని ట్వీట్ రూపంలో వెల్లడించారు.
2017లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్న నేపథ్యంలో తన కంపెనీని యాపిల్ కు అమ్మేయాలని ఎలాన్ మస్క్ భావించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుకు తీసుకెళితే.. భేటీకి కూడా నో చెప్పారట. అప్పట్లో టెస్లా విలువ 100 బిలియన్ డాలర్ల లోపే ఉండేది. అయితే.. యాపిల్ చీఫ్ నో చెప్పటం.. ఆ తర్వాత కంపెనీ అంతకంతకూ పెరుగుతూ.. ఈ రోజున ఆ షేర్ విలువ 1400 శాతం పెరిగింది. ఇప్పుడా కంపెనీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా అధినేత చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.