ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను వైసీపీ అధినేత, సీఎం జగన్ క్లాస్-మాస్ల మధ్య యుద్ధంగా చెబుతున్నారని.. కానీ, ఇది అబద్ధమని కాంగ్రెస్ పీసీసీ చీఫ్, జగన్ చెల్లెలు.. వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ ఎన్నికలను ఆమె.. నేరానికి-న్యాయానికి మధ్య జరుగుతన్న ఎన్నికలుగా పేర్కొన్నారు. తాజాగా సొంత జిల్లా కడపలోని ఆమె సొంత మేనమామ (విజయ మ్మ తమ్ముడు రవీంద్రనాథ్‌రెడ్డి) నియోజకవర్గం కమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల ఆద్యంతం కూడా సంచలన వ్యాఖ్యలే చేశారు. తను కడప ఎంపీగా పోటీ చేస్తోంది.. తన కోసం కాదన్నారు. న్యాయాన్ని గెలిపించేందుకే తాను ఎన్నికల్లోకి దిగినట్టు చెప్పారు.
సొంత బాబాయిని చంపేసిన వారికి ఆశ్రయం కల్పిస్తున్న వైసీపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే.. తాను ఇక్కడే ఉండి ప్రజల సమస్యలను పట్టించుకుంటానని..తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. ప్రజలు ఎప్పుడైనా తన ఇంటికి రావొచ్చన్నారు. కానీ, అవినాష్‌రెడ్డిని గెలిపిస్తే.. ఆయన జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నిందితుడని.. సొంత బాబాయిని ఘోరంగా నరికి చంపిన వారిలో ఒకరని అన్నారు. ఇలాంటి వ్యక్తిని కలుసుకుని బాధలు చెప్పుకొనేందుకు రేపు ప్రజలు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని.. మీకు ఇల్లు కావాలో.. జైలు కావాలో తేల్చుకోవాలని షర్మిల పిలుపునిచ్చారు.
మేనమామపైనా..
సొంత మేనమామ రవీంద్రనాథ్రెడ్డిపైనా షర్మిల నిప్పులు చెరిగారు. “మా మేనమామ ఓటుకు 5 నుంచి 10 వేలు ఇస్తాడు. తీసుకోండి. కానీ, ఓటు మాత్రం నాకే వేయండి. మా మేనమామ మనసులో కూడా నన్నే గెలిపించాలని అనుకుంటున్నట్టు తెలిసింది. ఆయన ఇచ్చే సొమ్ము తీసుకోండి. ఎందుకంటే.. ఈ ఐదేళ్లలో అక్రమ మార్గాల్లో బాగా పోగేశాడు. లెక్క పెట్టేందుకు.. చేతులు.. మిషన్లు కూడా సరిపోనంత పోగేశాడు` అని షర్మిల అన్నారు. ఈ ఐదేళ్లలో రవీంద్రనాథ్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని ఆమె నిలదీశారు. రైతుల సమస్యలు పట్టించుకున్నారా? అని నిలదీశారు.
తనను గెలిపిస్తే.. గత ఎన్నికల సమయంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి ఇక్కడి ప్రజలకు మాయ మాటలు చెప్పారని షర్మిల దుయ్యబట్టారు. కానీ, ఆయన గుప్పెడు మట్టి కూడా ఎత్తలేదన్నారు. సర్వారాయ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు ఏమో కానీ.. రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువు, రొయ్యల చెరువు కి నీళ్ళు వస్తున్నాయని తద్వారా ఆయన కోట్లు సంపాయించుకున్నారని.. ఇప్పుడు అదే డబ్బును మీకు పంచేందుకు వస్తున్నారని.. తీసుకోవాలని షర్మిల పిలుపు నిచ్చారు. కానీ, ఓటు మాత్రం ఆయన మేనకోడలుగా .. నాకే వేయాలని అన్నారు.