తెలంగాణ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. మరోవైపు, 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనను చూసి తమకు ఓటెయ్యాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దంటూ కేసీఆర్ ను హెచ్చరించింది.
అక్టోబర్ 30వ తేదీన బాన్సువాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టేలా కేసీఆర్ ప్రసంగించారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కేసీఆర్ బాధ్యతగల పదవిలో ఉండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఇకపై, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.
ఆ తరహా ప్రసంగాలు చేస్తే పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకుందని వార్నింగ్ ఇచ్చింది. అయితే, ప్రస్తుతం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించడం లేదని తెలిపింది. అంతకుముందు, దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి అనంతరం కాంగ్రెస్ నేతలను రెచ్చగొట్టేలా కేసీఆర్ మాట్లాడినట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరు వెంకట్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం స్థానిక రిటర్నింగ్ అధికారి నవంబర్ 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే తాజాగా సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చింది.