నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎలక్షన్ కమిషన్ ఖరాఖండిగా తేల్చింది. వలంటీర్లను ఎన్నికల విధులకు ఏజెంట్లుగా నియమించేందుకు వీల్లేదని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఏ అభ్యర్థి తరఫునా వారు ఏజెంట్లుగా ఉండకూడదు అని ఓ స్పష్టమయిన నియమావళి రూపొందించింది. వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జగన్ సర్కారును హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ ఆదేశాలు జారీచేయడంతో ఇప్పుడీ వార్త హల్చల్ చేస్తోంది.
ఈ ఆదేశాలను అన్ని జిల్లాలకు చెందిన రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు తెలియజేయాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసిందని ప్రధాన మీడియా స్పష్టం చేస్తోంది. అంటే ఇకపై వలంటీర్లు కేవలం ప్రభుత్వం అప్పగించిన కొన్ని పనులకు మాత్రమే పరిమితం కావాలన్నది ఈసీ భావన. ఓటర్ల నమోదు.. తొలగింపు.. చేర్పులు.. మార్పులు.. ఓటర్ల జాబితా ప్రచురణ.. పోలింగ్ కేంద్రాల ఎంపిక.. ఎన్నికల రోజు ఓటరు చీటీల పంపిణీ.. పోలింగ్ ఏర్పాట్లు.. పోలింగ్ విధులు.. ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన ఏ విధుల్లోనూ వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా ఉంటూ, పార్టీకి అనుబంధంగా పనిచేసేందుకు వీల్లేదు.
ఎందుకంటే వలంటీర్లు అన్న వారంతా ఫక్తు ప్రభుత్వ అనుబంధ వ్యక్తులు అన్న భావన వచ్చే విధంగానే ఎమ్మెల్యేలు, ఎంపీలూ మాట్లాడుతున్నారు. కనుక వారిని మిగతా సేవలకు వాడుకునేందుకు వీల్లేదని తేలిపోయింది. ఇటీవలే దాదాపు ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే మాటన్నారు. వీళ్లందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తున్నందున వీళ్లంతా పార్ట్ టైం సేవకులే అని ఈసీ నిర్థారించింది. కనుక ప్రభుత్వ జీతం పుచ్చుకుని ఓ ఉద్యోగిగా చెలామాణీ అయ్యాక రేపటి వేళ ఓ పార్టీకి ఏ విధంగా అనుబంధంగా ఏజెంట్లుగా పనిచేస్తారు అన్నది ఈసీ వాదన.
Comments 1