తెలంగాణ రాజకీయాల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం సంచలనం రేపింది. ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు దాదాపుగా నిజమేనని విజిలెన్స్, రెవెన్యూఅధికారులు ప్రాథమికంగా తేల్చడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ సూచన ప్రకారమే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఈటల స్పందించారు. తన శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేసినట్లు తెలిసిందని, ఇందుకు సంతోషిస్తున్నానని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయని ఆయన అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై భూకబ్జా ఆరోపణలు చేశారని, వాస్తవాలు త్వరలోనే తేలుతాయని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని, నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని అన్నారు. తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే సంగతి ప్రజలందరికీ తెలుసని అన్నారు.
25 ఏళ్ల చరిత్రలో మచ్చలేని మనిషిగా నిలిచానని, ఎవరిపైనా తను వ్యక్తిగత విమర్శలు చేయబోనని అన్నారు. అందరు నేతలు ఎన్నికలలో నిమగ్నమైతే తాను పూర్తిగా కరోనా నియంత్రణపైనే దృష్టి సారించారని ఈటల తెలిపారు. అందుకే ఏం జరుగుతోందో తనకు తెలియలేదని అన్నారు. అయితే, మంత్రి ఈటలను ఇంకా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయలేదు. ఈ క్రమంలోనే కొత్త హెల్త్ మినిస్టర్‌గా జడ్చర్ల ఎమ్మెల్యే డా. చర్లకోల లక్ష్మారెడ్డికి అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే లక్ష్మారెడ్డికి ప్రగతిభవన్ నుంచి పిలుపు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న లక్ష్మారెడ్డికే ఆ శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల పార్టీకి రాజీనామా చేస్తారా…తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు, ఈటలతోపాటు మరికొందరు మంత్రుల పైనా వేటుపడనుందని తెలుస్తోంది. ఈటల ఒక్కరినీ తొలగిస్తే వ్యతిరేకత వస్తుందన్న నేపథ్యంలో కనీసం ముగ్గురిని మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, కొత్త మంత్రుల్లో కచ్చితంగా కేసీఆర్ తనయురాలు మాజీ ఎంపీ కవితకు చోటు దక్కనుందని తెలుస్తోంది.