హుజురాబాద్ ఉప ఎన్నికపై బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో తనదే గెలుపంటూ ఈటల ధీమా వ్యక్తం చేస్తుండగా…అధికార పార్టీ కూడా సిట్టింగ్ స్థానం తమదేనంటోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టిన ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. హంతక ముఠాతో ఆ మంత్రి చేతులు కలిపారని తనకు సమాచారం ఉందని ఆరోపించారు. నరహంతకుడు నయీం చంపుతానని బెదిరిస్తేనే భయపడలేదని, ఈ చిల్లర ప్రయత్నాలకు భయపడేది లేదు అంటూ దూషించారు. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడినని, ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతామన మండిపడ్డారు.
తెలంగాణను కేసీఆర్ రజాకార్ల రాజ్యం చేశాడని,.దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు ఏవని ప్రశ్నించారు. ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రజల మధ్యకు తీసుకువచ్చానని అన్నారు. తన పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని, తన కార్యకర్తలకు అన్నం పెట్టుకోడానికి తెచ్చుకున్న సామానులకు కూడా తాళం వేశారని నిప్పులు చెరిగారు. కార్యకర్తలకు బియ్యం సరఫరా చేసే రైస్ మిల్లును సీజ్ చేశారని, ఓటమి భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ నీచమైన సంస్కృతికి ఈ ఘటనలు నిదర్శనాలని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు తనదేనని అన్నారు.