తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ పై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్…డైరెక్ట్ గా ఈటలపై విమర్శలు చేయకపోయినా…ఆయన డైరెక్షన్ లోనే ఈటలపై టీఆర్ఎస్ నేతల మాటల తూటాలు పేలుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు.
తనపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఈర్ మెప్పుపొందాలని హరీష్‌రావు చూస్తున్నాడని, త్వరలోనే తన గతే హరీష్‌రావుకు పడుతుందని జోస్యం చెప్పారు. తన నియోజకవర్గం వారికి హరీష్ దావత్, డబ్బు ఇస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై కేసీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారు.
టీఆర్ఎస్ అబద్ధాల పత్రిక, ఛానల్లో పదేపదే ఆ కుట్రలు చూపించారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచానన్నారని, అందుకే రాజీనామా చేశానని చెప్పారు. డబ్బు, ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకుందని అన్నారు. తమతో తిరిగే యువకుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలని, చుట్టంగా కాదని ఈటల హితవు పలికారు. మరి, ఈటల మాటల తూటాలపై హరీష్ రావు స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.