అందరికి ఆలోచనలు ఉంటాయి. కానీ.. కొందరు మాత్రం సమయానికి తగ్గట్లుగా వ్యవహరించి క్రెడిట్ కొట్టేస్తారు. మరికొందరు మనసులోని మాటను బయటకు చెప్పుకోలేక అత్యుత్తమ అవకాశాల్ని మిస్ చేసుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర అంశాన్ని కేంద్ర మంత్రిని నేరుగా అడిగేశారు. ఈ నెల ఒకటి నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికి వ్యాక్సిన్ వేసుకోవటానికి కేంద్రం అనుమతులు ఇవ్వటం తెలిసిందే.
తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ భారీగా పెరిగిపోతున్న వేళ.. కేసుల సంఖ్యను తగ్గించేందుకు.. వైరస్ తీవ్రతను తగ్గించుకోవటానికి వీలుగా వ్యాక్సినేషన్ ను మరింత మందికి యుద్ధ ప్రాతిపదికన అందజేయాల్సిన అవసరం ఉంది. కేసుల పెరుగుదలకు చెక్ పెట్టాలంటే.. వైరస్ వ్యాప్తి విస్తరించకుండా చేయటంతో పాటు.. వ్యాక్సినేషన్ భారీగా చేపట్టాల్సిన అవసరం ఉంది.టీకాల్ని 45 ఏళ్లకు పైబడిన వారికి కాకుండా.. పాతికేళ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి వేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తే.. పరిస్థితుల్లో మార్పు వచ్చే వీలుంది.
కాకుంటే.. అంత మందికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావటం కష్టమైన అంశం. అందుకే.. చాలామంది కేంద్రాన్ని పాతికేళ్లకు పైబడిన వారికి టీకా గురించి డిమాండ్ చేయలేని పరిస్థితి. ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల ఒక అడుగు ముందుకేసి.. కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కు ఒక విన్నపాన్నిచేశారు.దేశ వ్యాప్తంగా పాతికేళ్లకు పైబడిన వారందరికి వ్యాక్సిన్ వేసుకునేలా కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరారు. మరి.. దీనికి కేంద్రమంత్రి స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
ఈటెల చెప్పినట్లుగా పాతికేళ్లకు పైబడిన వారికి టీకా ఇవ్వాలన్న మాటకు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయితే.. హామీ మాత్రం ఇవ్వలేదంటున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కానీ.. కర్ఫ్యూ విధించే అస్కారం లేదని తేల్చిన ఈటెల.. ఎంతో అవసరం ఉంటే తప్పించి బయటకు తిరగొద్దని సూచన చేశారు. ఈటెల కోరినట్లుగా కేంద్రం కాని పాతికేళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటే.. ఆ క్రెడిట్ కచ్ఛితంగా ఈటెలకే చెల్లుతుంది. ఆలోచనకు సైతం సాహసించని వేళ.. అందుకు భిన్నంగా కేంద్రాన్ని అడిగేసిన ఈటెల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.