హుజురాబాద్ ఉప ఎన్నికలపై చాలాకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ హవా తగ్గిందని నిరూపించేందుకు హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ పట్టుదలతో ఉన్నారు. ఇక, ఈటలను దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ…హుజురాబాద్ లో గెలుపు తనదేనని ఈటల ధీమాగా ఉన్నారు.
ఆ ధీమాకు తగ్గట్లుగానే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. హుజురాబాద్ లో తనకు ఎంత పట్టుందో ఈటల రాజేందర్ ఈ గెలుపుతో మరోసారి నిరూపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 865 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.
కౌంటింగ్ లో అన్ని రౌండ్లలో ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. మరో 2 రౌండ్లు మిగిలి ఉండగానే ఈటల గెలుపు ఖరారు కాగా…చివరకు 23 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 2,05, 536 ఓట్లు పోల్ కాగా, ఈటలకు 1,06,213, గెల్లు శ్రీనివాస్ కు 82, 348, కాంగ్రెస్ కు 2767 ఓట్లు వచ్చాయి.
ఈటల రాజేందర్ గెలుపుతో తెలంగాణలో బీజేపీ నేతలు, కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హుజురాబాద్ నుంచి ఈటల వరుసగా 2004 నుంచి 7 సార్లు గెలిచారు. 3 సార్లు ఉప ఎన్నికల్లో..4 సార్లు సాధారణ ఎన్నికల్లో గెలిచిన ఈటల…హుజురాబాద్ తనకు పెట్టని కోట అని ప్రూవ్ చేశారు. ఈటలకు 30వేల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పగా…అందుకు తగ్గట్లుగా ఈటల 23 వేల మెజారిటీతో గెలవడం విశేషం.