అంతా ఊహించినట్టుగానే బర్తరఫ్ అయిన తెలంగాణ సీనియర్ పొలిటిషియన్ ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితోపాటు టీఆర్ ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఈటల ప్రకటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకూ కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదని, అది ప్రగతి భవన్ కాదు….బానిసల భవన్ అని షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అని, కరీంనగర్ ప్రజలు తనను గుండెల్లోపెట్టి చూసుకుంటారని అన్నారు.
తనను రాత్రికి రాత్రే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని తన వివరణ కూడా అడగకుండానే చర్యలు తీసుకోవడం బాధించిందని అన్నారు. ప్రాణం ఉండగానే బొంద పెట్టారని, సీఎం ఆదేశించడంతోనే ఇలా చేస్తున్నారని అన్నారు.. హుజురాబాద్‌లోని నాయకులను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం వంటివి చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజక వర్గంలో టీఆర్ఎస్ ను బలపర్చింది ఈటల రాజేందర్ మాత్రమే అని ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం చాలాసార్లు రాజీనామా చేశానని, అన్ని సార్లు తన నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించుకున్నారని అన్నారు.
తనతో కలిసి మెలసి తిరిగిన తనపై కుట్రలు పన్నుతున్నారని, ఈ దాడి, కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్ తో ఉన్న అనుబంధం నేటితో తెగిపోయిందని చెప్పారు. గతంలో ఓ సారి సీఎంను కలవడానికి వెళితే అపాయింట్ మెంట్ లేదని గేటు వద్దే మమ్మల్ని ఆపేశారని, మరోసారి అపాయింట్ మెంట్ తీసుకొని వెళ్లినా గేటు వద్ద నుంచే వెనుదిరిగామని అన్నారు. బానిస కంటే నీచంగా మంత్రి పదవి ఉందని ఎంపీ సంతోష్ కుమార్ తో అన్నానని, దీనికి ప్రగతి భవన్ అని కాకుండా బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని సూచించానని ఈటల రాజేందర్ తెలిపారు.