ఈసాలా కప్ నమ్దే…. కన్నడలో ఈ మాటకు అర్థం.. ఈ సంవత్సరం కప్పు మనదే అని. ఇది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల నినాదం. 2008లో తొలి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఆర్సీబీ ప్రతిసారీ ఫేవరెట్ జట్లలో ఒకటిగానే బరిలోకి దిగుతుంది. స్టార్లతో నిండిన ఆ జట్టు మీద అభిమానులు భారీ అంచనాలు, ఆశలు పెట్టుకుంటారు. కొన్ని మ్యాచుల్లో అదరగొట్టి కప్పు మీద ఆశలు పెంచుతుందా జట్టు. చివరికి చూస్తే ఏదో ఒక దశలో బోల్తా కొడుతుంది.
గత 14 సీజన్లలో 3 సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టు.. కప్పు మాత్రం గెలవలేకపోయింది. గత కొన్నేళ్ల నుంచి ఫైనల్ సంగతలా ఉంచితే.. ప్లేఆఫ్స్ చేరడమూ కష్టమైపోతోంది ఆ జట్టుకి. టీమ్ ఇండియా కెప్టెన్‌గా కోహ్లి ఎన్నో గొప్ప విజయాలు సాధించినా.. ఐపీఎల్లో మాత్రం తన జట్టును గెలిపించలేకపోయాడు. గత ఏడాది నాటకీయ పరిణామాల మధ్య అతను భారత జట్టు పగ్గాలతో పాటు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు కూడా వదిలేయడం తెలిసిందే.
ఈ సీజన్లో డుప్లెసిస్ నాయకత్వంలో బరిలోకి దిగిన ఆర్సీబీ లీగ్ దశలో మెరుగైన ప్రదర్శనతో కప్పు మీద ఆశలు రేపింది. కోహ్లి కెప్టెన్ కాకపోయినా, అతను ఈ సీజన్లో ఆటగాడిగా కూడా తీవ్రంగా నిరాశ పరిచినా.. అతడి జట్టు కప్పు కొట్టాలని అభిమానులు ఎంతో కోరుకున్నారు. అతి కష్టం మీద ప్లేఆఫ్స్ చేరి.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్‌నవూను ఓడించగానే ఇక కప్పు పట్టేసినట్లే అని ఫిక్సయ్యారు. కానీ రెండో క్వాలిఫయర్‌లో ఆ జట్టు తుస్సుమనిపించింది. రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐతే ఆర్సీబీ ఓడిన టైంలో సోషల్ మీడియాలో ‘ఈసాలా కప్ నమ్దే’ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. నిన్న రాత్రి ఆర్సీబీ ఓటమి బాట పట్టగానే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టింది యాంటీ ఫ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా ఆర్సీబీ అభిమానులు చేసే హడావుడికి.. అవతలి వాళ్లు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు.
ఆ జట్టు ఎప్పుడు ఓడినా మీమ్స్, జోక్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంటుంది. ఎలిమినేటర్‌లో గెలవగానే.. ఇక కప్పు తమదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ హడావుడి చేయడం.. రెండో క్వాలిఫయర్‌లో ఆ జట్టు గెలిచే అవకాశాలు లేవని అర్థమవగానే యాంటీ ఫ్యాన్స్ రెెచ్చిపోయారు. మీమ్స్‌తో ట్విట్టర్‌ను మోతెక్కించేస్తున్నారు.