- మాతృభాషకు ఎగనామం
- మండలానికో స్కూలుకే
- తెలుగు పరిమితం
వైసీపీ ఏలుబడిలో నవ్యాంధ్రలో పిల్లల చదువులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. కనీస ప్రాథమిక విద్యను అందుకోవడానికి నానా తంటాలు పడుతున్న విద్యార్థులు.. ఇప్పుడు తమ ఊరు వదిలి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న స్కూల్లో ప్రతి రోజూ చదువుకుని రావాలట!
పరిమితికి మించిన భారంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో హేతుబద్ధత లేకుండా ప్రభుత్వం తలపెట్టే తరగతుల విలీన ప్రక్రియతో మొత్తంగా పాఠశాల విద్యే ప్రమాదంలో పడింది.
కొత్తగా జతచేసే తరగతులకు సెకండరీ స్కూలు భవనాల్లో గదులు ఉన్నాయా.. మూడో తరగతి చదివే ఎనిమిదేళ్ల పిల్లాడు మూడు కిలోమీటర్ల దూరంలోని స్కూలుకు రోజూ వెళ్లి రాగలడా.. ఇవేవీ ఆలోచించకుండానే నూతన విద్యా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ విధానంలో మాతృభాషకు కేంద్రం పెద్దపీట వేస్తే.. మన రాష్ట్రంలో మాత్రం కేవలం మండలానికో తెలుగు మీడియం స్కూలు పెట్టబోతున్నారు. తెలుగు మీడియంలో చదువుకోవాలనుకునేవారు ఆ మండలంలోని ఇతర ఊళ్ల నుంచి మండల కేంద్రానికి రోజూ వచ్చి చదువుకోవాలన్న మాట.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని తహతహలాడడమే తప్ప.. అందుకు ఎలాంటి పద్ధతి ఎంచుకోవాలో అధికారులు కనీస ఆలోచన చేయడం లేదు.
ఎందుకింత హడావుడి..
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంపై రాష్ట్రంలోని ద్యావేత్తలు, ఉపాధ్యాయులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా, హడావిడిగా అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం సన్నద్ధమవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లక్షలాది మంది పిల్లలకు, ఉపాధ్యాయులతో ముడిపడిఉన్న ఈ అంశంపై సంస్కరణల పేరుతో ఏకపక్ష ధోరణితో అడుగులు వేయడం గందరగోళం రేపుతోంది. ప్రభుత్వ అనాలోచిత ధోరణి కారణంగా పిల్లలు ప్రాథమిక విద్యకు దూరం కావడమో లేక చదువుకోడానికి రోజూ దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడమో జరుగుతుందని విద్యానిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రైమరీని అండన్వాడీల్లో పూర్తి చేసి.. ఐదేళ్లు రాగానే విద్యార్థులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరుతున్నారు. 1 నుంచి ఐదో తరగతి వరకు అక్కడ చదివి.. ఆరో తరగతిలో సెకండరీ స్కూలులో చేరి అక్కడే పదో తరగతి వరకు చదువుతారు.
నూతన విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలో ఇక అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు కనిపించవు. ప్రీప్రైమరీ, ఫౌండేషన, సెకండరీ స్కూళ్లు మాత్రమే ఉంటాయి. పీపీ-1, పీపీ-2లు.. వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా పనిచేస్తాయి.
ప్రిపరేటరీ-1, 1, 2వ తరగతులు ఫౌండేషన స్కూళ్లలో బోధిస్తారు. మూడో తరగతికే విద్యార్థి సెకండరీ స్కూలు బాట పడతాడు. అంగనవాడీ కేంద్రాలను సమీపంలోని ప్రాథమిక స్కూళ్లలో అనుసంధానం చేస్తారు. కిలోమీటరు పరిధిలో ఓ ఫౌండేషన స్కూలు ఉండేలా చూస్తారు.
అంటే ఇప్పటివరకు ఉన్న అంగనవాడీ సెంటర్లు కనుమరుగవుతాయి. తరగతుల విలీనం కారణంగా భారీగా ప్రాథమిక పాఠశాలలు కూడా మూతపడతాయి. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 34 వేల ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. నూతన విధానం అమల్లోకి వస్తే వీటి సంఖ్య 10 వేలకు తగ్గిపోతుంది.
అంటే ఏకంగా 24 వేల స్కూళ్లు మూతపడతాయి. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులు ఇకపై సమీపంలోని ప్రాథమికోన్నత లేక ఉన్నత పాఠశాలలకు వెళ్లాలి.
ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాథమికోన్నత లేక ఉన్నత పాఠశాలను గుర్తిస్తారు. అంటే మూడో తరగతి విద్యార్థి ఇకపై కనీసం మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధానం వల్ల పెద్దఎత్తున పిల్లలు డ్రాపవుట్స్‌గా మారే ప్రమాదం ఉంది. విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలి.
ప్రతి మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉండాలి. కానీ రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ప్రకారం చూస్తే.. 3, 4, 5 తరగతుల విద్యార్థులు కూడా ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ విధానం.. విద్యాహక్కు చట్టానికి పూర్తి విరుద్ధంగా ఉన్నదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
సరిపడా టీచర్లు ఎక్కడా?
తరగతుల విలీనం ప్రక్రియ మొదలైతే అనివార్యంగా టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. భవిష్యతలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశమ ఉండదు.
ప్రాథమిక పాఠశాలల్లో 1:30 నిష్పత్తిలో, హైస్కూళ్లలో 1:40 నిష్పత్తిలో టీచర్లు-విద్యార్థులు ఉండేలా సర్కారు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఉన్న 26 వేల టీచర్ల ఖాళీలు పోతాయి.
గత విద్యాసంవత్సరంలో అదనంగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు ప్రభుత్వం అధికారికంగానే చెప్పింది. ఆ లెక్కన కొత్తగా దాదాపు 15 వేల టీచర్లను నియమించాల్సిన అవసరముంది. కానీ ప్రభుత్వ వైఖరి చూస్తే భవిష్యతలో అసలు నియామకాలు చేపట్టే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద తదితర విద్యా పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్న సర్కారు.. నూతన విద్యావిధానంలో భాగంగానే వాటిని చేపట్టినట్లు చెబుతోంది. అయితే తాజా నిర్ణయాలతో అసలు విద్యా పథకాల లక్ష్యం నెరవేరుతుందా అనేది ప్రశ్న.
ఇప్పటివరకు అంగనవాడీ టీచర్లు శిశు సంక్షేమ శాఖ పరిధిలో, స్కూలు టీచర్లు పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. ఇకపై వీరిద్దరూ ఒకే వ్యవస్థలోకి రావలసి ఉంటుంది. సర్వీసు నిబంధనల దృష్ట్యా ఇది సాధ్యమే కాదు. జడ్పీ, మున్సిపల్ టీచర్ల విలీనానికి కోర్టులే బ్రేకులు వేశాయి.