నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజలతోపాటు పలువురు సినీ ప్రముఖులను అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపింది. ఆ తర్వాత హఠాత్తుగా అకున్ సబర్వాల్ బదిలీ కావడంతో ఆ కేసు కోల్డ్ స్టోరేజిలోకి చేరింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవడంతో కేసు విచారణ కొత్త కోణంలో మొదలైంది.
డ్రగ్స్ కేసులో భారీ మొత్తంలో నగదు విదేశాలకు బదిలీ అయిందని ఈడీ అధికారులకు పక్కా సమాచారం ఉండడంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చింది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రువర్ గా మారి ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ మొదలుబెట్టింది. ఆ తర్వాత ఈడీ నోటీసులందుకున్న పూరీ జగన్నాథ్, ఛార్మి తదితరులు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఈడీ మరింత దూకుడు చూపిస్తోంది.
ఎక్సైజ్ శాఖ అధికారులలు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వడం లేదిన హైకోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ డేటా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఎస్ సోమేశ్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌కు లపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోర్టును ఈడీ కోరింది.
ఈ క్రమంలోనే తాజాగా ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు 800 పేజీలతో పోలీసులు నివేదిక సమర్పించారు. 12 కేసుల ఎఫ్‌ఐఆర్‌లతోపాటు చార్జిషీట్లు, స్టేట్మెంట్లు, నిందితులు, సాక్షుల వివరాలన్నీ పొందుపర్చారు. నిందితులు, సినీ తారలకు చెందిన.. 600 GB వీడియో రికార్డులను కోర్టుకు అందజేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు, హైకోర్టుకు మొత్తం 10 ఆడియో క్లిప్స్, కాల్ డేటా కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ సాక్ష్యాలన్నింటినీ ఈడీకి హైకోర్టు అందజేసింది.