దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్కాంలో కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత పేరు బలంగా వినిపించడం సంచలనం రేపింది. అయితే, తనపై బీజేపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యవహారంలో తన పేరు రాకుండా చూడాలని కవిత కోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా కవితకు ఈడీ షాకిచ్చింది. ఎమ్మెల్సీ కవిత పీఏగా పనిచేస్తున్న బోయినపల్లి అభిషేక్ రావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల ఈడీ సోదాలకు దిగింది. ఢిల్లీ, హైదరాబాద్, లక్నో, గురుగావ్, బెంగళూరు, చెన్నై వంటి ముఖ్య నగరాల్లో తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ లో ఆరు చోట్లు టార్గెట్ అయ్యాయి. రాబిన్ డిసిలర్స్ నిర్వహిస్తున్న రామచంద్రన్ పిళ్లై కంపెనీతో పాటు ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
పిళ్లై సహా బోయినపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలను ఈడీ అధికారులు జల్లెడ పడుతున్నారు. సోదాల విషయాన్ని ఈడీ ప్రధాన కార్యాలయ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. బెంగుళూరుతో పాటు హైదరాబాద్‌లో రామచంద్రన్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. దీంతో, హైదరాబాద్ లో రామచంద్రన్‌కు సంబంధించిన కంపెనీతో పాటు ఇంట్లో కూడా ఈడీ దాడులు చేపట్టింది.
ఇంతకాలం, ఈ స్కామ్ లో తన పేరు బద్నాం చేస్తున్నారని చెప్పిన కవిత…తాజాగా సోదాలతో ఇరకాటంలో పడినట్లయింది. ఏకంగా, కవిత పీఏ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టడం సంచలనం రేపింది. ఈ తనిఖీలలో కవితకు సంబంధించిన విషయాలు ఏమన్నా బయటపడతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.